Gulf of America | ఇటీవలే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీన యూఎస్ అధ్యక్షుడిగా రెండోసారి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకముందే ట్రంప్ వ్యవహారశైలి ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారుతోంది.
ముఖ్యంగా పొరుగు దేశాలపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కెనడా, గ్రీన్లాండ్, పనామా కెనాల్ తమకేనంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు వివాదాస్పదంగా మారాయి. ఇక అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో (Gulf of Mexico)ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’ (Gulf of America)గా మారుస్తానంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై మెక్సికో అధ్యక్షురాలు (Mexico President) క్లాడియా షేన్‌బామ్ (Claudia Sheinbaum) తాజాగా స్పందించారు. తామెందుకు అమెరికాను ‘మెక్సికన్ అమెరికా’ (Mexican America) అని పిలవకూడదంటూ ట్రంప్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
బుధవారం విలేకరు సమావేశంలో మాట్లాడుతూ.. 17వ శతాబ్దంలో ఉత్తర అమెరికాను ‘మెక్సికన్ అమెరికా’ అని పిలిచేవారని గుర్తుచేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఐక్యరాజ్య సమితి గుర్తించిందన్న విషయాన్ని మర్చిపోవద్దంటూ పరోక్షంగా ట్రంప్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ‘మనమెందుకు యూఎస్‌ను ‘మెక్సికన్ అమెరికా’ అని పిలవకూడదు..?’ అని ప్రశ్నించారు. ఇది వినడానికి బాగుంది కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్.. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలోకి అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నివారణకు ఇవి సహాయపడతాయని ఆయన చెప్పారు. మెక్సికో, కెనడాల నుంచి వచ్చే ప్రతి వస్తువుపై 25 శాతం సుంకం విధించే ఉత్తర్వులపై జనవరి 20 సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు. ఫెంటానిల్ స్మగ్లింగ్‌ను చైనా అరికట్టే వరకు ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై అదనంగా 10 శాతం సుంకం విధించాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఈ ప్రకటన తర్వాత ట్రంప్‌తో కెనడా ప్రధాని ట్రూడో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ట్రూడోకు ట్రంప్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాలను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేదంటే సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని సూచించారు. ఈ క్రమంలో ‘గవర్నర్ ఆఫ్ కెనడా’ అంటూ ట్రూడోపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ట్రంప్ వ్యాఖ్యలను జస్టిన్ ట్రూడోతో పాటు ప్రతిపక్ష నేతలు ఖండించారు. అమెరికాలో కెనడా ఎప్పటికీ భాగం కాబోదని, తమది గొప్ప స్వతంత్ర దేశమని స్పష్టం చేశారు.
Also Read..
Donald Trump | పక్క దేశాలపై ట్రంప్ కన్ను.. సైనిక చర్యకు దిగుతారా?
Justin Trudeau | అమెరికాలో విలీనమవడం అసాధ్యం.. ట్రంప్ ప్రతిపాదనపై ఘాటుగా స్పందించిన ట్రూడో
కెనడా ప్రధాని రేసులో అనితా ఆనంద్