ఒట్టావా, జనవరి 7: కెనడా ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని జస్టిన్ ట్రూడో ప్రకటించడంతో కొత్త ప్రధాని ఎన్నికకై అధికార లిబరల్ పార్టీలో కసరత్తు జరుగుతున్నది. ప్రధాని రేసులో ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ప్రధాన పోటీదారుగా అనితా ఆనంద్(57) ఉన్నారు. ప్రస్తుతం ఆమె కెనడా రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనిత తల్లిదండ్రులు భారత్ నుంచి కెనడాకు వలస వెళ్లారు. కెనడాలోని నోవా స్కోటియాలో జన్మించిన అనిత పొలిటికల్ స్టడీస్, న్యాయవిద్యను పూర్తి చేసి టొరంటో యూనివర్సిటీలో విద్యా బోధన చేశారు.
2019లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తక్కువకాలంలోనే లిబరల్ పార్టీలో, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 నుంచి ఆమె ట్రూడో క్యాబినెట్లో మంత్రిగా సమర్థురాలిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ప్రధాని పదవికి ఆమె పేరును పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. భారతీయ మూలాలు కలిగిన ఎంపీ జార్జ్ చాహల్, ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్, ఆర్థికవేత్త మార్క్ కార్నే, సైతం ఈ పదవికి పోటీ పడుతున్నారు.