న్యూఢిల్లీ, జనవరి 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస హెచ్చరికల నేపథ్యంలో అమెరికాతో సైనిక ఘర్షణలు అనివార్యంగా కనిపిస్తున్న వేళ ప్రజలు అందుకు సిద్ధంగా ఉండాలని గ్రీన్లాండ్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. రాజధాని నూక్‌లో ప్రధాని జెన్స్ ఫ్రెడెరిక్ నీల్సన్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రజలను సిద్ధం చేసేందుకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అమెరికాతో ఘర్షణ తలెత్తే అవకాశం లేకపోలేదని, అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రీన్లాండ్ సిద్ధంగా ఉండాలని ప్రధాని చెప్పారు. తమ దేశం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు గ్రీన్లాండ్ ఆర్థిక మంత్రి మ్యూట్ బోరప్ ఎగెడే అన్నారు. దేశంలోని 57,000 మంది ప్రజలను సంసిద్ధుల్ని చేసేందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఐదు రోజులకు సరిపడ ఆహార వస్తువులను ఇంట్లో నిల్వ చేసుకోవడం వంటివి ఈ మార్గదర్శకాల్లో ఉన్నట్లు ఆయన చెప్పారు.