Truth Social | అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చెందిన ‘ట్రూత్’ సోషల్ యాప్‌కు గూగుల్ తన ప్లేస్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు డౌన్లోడ్ చేసుకునేందుకు బుధవారం అనుమతి ఇచ్చింది. నిబంధనలకు అనుగుణంగా యాప్‌లో మార్పులు చేసిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో నిర్ధారించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ పేర్కొన్నది. గతంలో ట్రూత్ సోషల్ యాప్‌లో హింసాత్మక పోస్టులు, అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన పోస్టులను తొలగించే, మార్పులుచేసే వీలు లేకుండా ఉండేదని, దీంతో యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించినట్లు పేర్కొంది. గూగుల్ నిబంధనల మేరకు అభ్యంతరకరమైన పోస్టులను నిషేధించే విధానాలకు అనుగుణంగా ట్రూత్ యాప్ అప్డేట్ అయ్యింది.
అభ్యంతరకర కంటెంట్‌ను నివేదించడానికి, తొలగించేందుకు, స్వేచ్ఛాహక్కును దుర్వినియోగం చేసేవారిని నిరోధించేందుకు సమర్థవంతమైన సిస్టమ్‌ను యాప్‌లో అందుబాటులో ఉంచడంతో గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్లోడ్ చేసుకునేలా అనుమతి ఇచ్చినట్లు వివరించింది. ఈ సందర్భంగా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ప్రతినిధులు మాట్లాడారు. గూగుల్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంలో క్యాపిటల్ హిల్స్ వద్ద జరిగిన అల్లర్ల నేపథ్యంలో ‘ప్రేరేపిత ట్వీట్ల’తో ట్రంప్ ఖాతాపై ట్విట్టర్ 2021 శాశ్వత నిషేధం విధించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రెండేళ్లు ఖాతాలను బ్యాన్ చేసింది. అదే ఏడాది అక్టోబర్‌లో ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ యాప్‌ను ప్రకటించారు. 2022లో ఫిబ్రవరిలో ప్రారంభమైంది.