బెర్లిన్: ఈసారి జీ-7 దేశాల సదస్సు జూన్లో బవేరియన్ ఆల్ప్స్లో జరగనున్నది. ఆ సదస్సును జర్మనీ నిర్వహిస్తోంది. అయితే ఆ శిఖరాగ్ర సమావేశాలకు ఇండియాను జర్మనీ ఆహ్వానించడం లేదని ప్రాథమికంగా తెలుస్తోంది. ఉక్రెయిన్ అంశంలో భారత్ అనుసరిస్తున్న వైఖరి వల్ల ప్రధాని మోదీని జీ7 సదస్సుకు ఆహ్వానించడం లేదని కొన్ని వార్తలు వస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలుతో పాటు యూఎన్ ఓటింగ్లో ఇండియా తటస్థంగా ఉన్న కారణంగా జర్మనీ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ సదస్సు కీలకం కానున్నది. కానీ ఇండియాకు ఆహ్వానం ఇచ్చేందుకు జర్మనీ ఆసక్తిగా ఉన్నట్లు మరికొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. శిఖరాగ్ర సదస్సుకు సెనిగల్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా దేశాలను జర్మనీ ఆహ్వానించినట్లు స్పష్టమవుతోంది. యూఎన్ మానవ హక్కుల మండలి నుంచి రష్యాను బహిష్కరించేందుకు జరిగిన యూఎన్ ఓటింగ్లో ఇండియా పాల్గొనకపోవడం పట్ల జర్మనీ కొంత నిరుత్సాహంగా ఉంది. అయితే ఆహ్వానితుల తుది జాబితా ఫైనలైజ్ అయిన తర్వాత వివరాలు అన్నీ తెలుస్తాయని ప్రభుత్వ ప్రతినిధి స్టీఫెన్ హెబస్ట్రీట్ తెలిపారు.