IDF | ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) సెంట్రల్ గాజాలోని పౌరులను వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించాయని ఐడీఎఫ్ అరబిక్ భాషా ప్రతినిధి అవిచాయ్ అడ్రేయ్ పేర్కొన్నారు. గాజా స్ట్రిప్‌లోని నుసేరాత్, అల్-జహ్రా, అల్-ముఘ్రాకా ప్రాంతాల వాసులక ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు. దాంతో పాటు ఉత్తర తీర ప్రాంతాల (అల్ నుజా, అల్ బాడి, అల్ బుస్మా, అల్ జహ్రా, అల్ బుస్తానిమ్, బదర్, అబు హురైరా, అల్ రుడా, అల్స ఫా) ప్రాంతాలకు సైతం ఈ హెచ్చరికలు వర్తిస్తాయన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను అంతం చేయడానికి సైన్యం పూర్తిస్థాయి ఆపరేషన్ నిర్వహిస్తోందని ఐడీఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
మిస్సైల్ ప్రయోగించే అవకాశం ఉందని.. ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న అన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటనలో పేర్కొంది. పౌరులు వెంటనే ఆయా ప్రాంతాలను ఖాళీ చేయాలని ఐడీఎఫ్ ప్రకటనలో పేర్కొంది. భద్రత కోసం, వెంటనే అల్ మవాసి ప్రాంతం వైపు దక్షిణం దిశగా వెళ్లాలని.. తిరిగి ఆయా ప్రాంతాల వైపు మళ్లీ తిరిగి రావొద్దని హెచ్చరించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 2023లో ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్ ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో 1200 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారంలో ఇప్పటివరకు 58 వేలకుపైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో పెద్ద సంఖ్యలో జనాభా నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు.