వాషింగ్టన్, ఏప్రిల్ 27: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఆహారం, ఇంధన ధరలు పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొన్నది. రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి ఆహార ధాన్యాలు, ఎరువులు, సహజవాయువు గణనీయంగా ఎగుమతి అవుతున్నాయని, యుద్ధం కారణంగా ఉత్పత్తికి, రవాణాకు ఆటంకం కలిగిందని తెలిపింది. ధరల పెరుగుదలకు ఇదే కారణమని పేర్కొన్నది. నాటో, యూరోపియన్ కూటమి దేశాలైన బల్గేరియా, పోలండ్ దేశాలకు రష్యా గ్యాస్ సరఫరాను నిలిపివేసింది.
తమ నుంచి కొనుగోలు చేసే సహజవాయువుకు రూబుళ్లలో చెల్లింపులు చేయడానికి ఆ దేశాలు తిరస్కరించడంతో సరఫరాను నిలిపివేసినట్టు రష్యా ఇంధన సరఫరా దిగ్గజం గజ్‌ప్రామ్ ప్రకటించింది. రూబుళ్లలో చెల్లింపులు జరపడానికి నిరాకరిస్తే మిగతా ఈయూ దేశాలకు కూడా గ్యాస్ సరఫరాను నిలిపివేస్తామని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ హెచ్చరించారు.
కాంట్రాక్టులను రష్యా ఉల్లంఘించింది
రష్యా నిర్ణయాన్ని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్‌డెర్ లేయెస్ ఖండించారు. ఇది ‘బ్లాక్ మెయిల్ చేయడమే’ అని విమర్శించారు. గ్యాస్ సరఫరా నిలిపివేతపై బల్గేరియా, పోలండ్ స్పందించాయి. ఏప్రిల్ నెలకు సంబంధించిన చెల్లింపులు ముందుగానే చేశామని, రష్యా కాంట్రాక్టును ఉల్లంఘించిందని బల్గేరియా ఆరోపించింది. కొనుగోలు ఒప్పందాన్ని ఉల్లంఘించిన రష్యా నుంచి పరిహారం కోసం అన్ని మార్గాలను ఉపయోగించుకొంటామని పోలండ్ వెల్లడించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాల లోటు రానివ్వద్దని, ఎన్ని అడిగితే అన్ని పంపించాలని అమెరికా తన మిత్ర దేశాలను బుధవారం కోరింది. మరియుపోల్‌లోని అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటులో చిక్కుకుపోయిన పౌరుల తరలింపునకు పుతిన్ అంగీకరించారని ఐరాస వెల్లడించింది.
పుతిన్ ఆరోగ్యంపై మళ్లీ అనుమానాలు
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ప్రజలనుద్దేశించి ప్రసంగించేప్పుడు, ఇంటర్వ్యూల్లో పుతిన్ హావభావాలు, ఆయన మాట్లాడుతున్న తీరును విశ్లేషిస్తున్న వైద్య నిపుణులు ‘పుతిన్ ఏదో తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారు’ అని చెప్తున్నారు. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకోతో పుతిన్ ఇటీవల భేటీ అయ్యారు. ఆ సమయంలో పుతిన్ చేతులు వణకడం, టేబుల్‌ను ఆసరాగా పట్టుకొని కూర్చోవడాన్ని వైద్యులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అంతే కాకుండా పుతిన్ ముఖానికి కాస్మెటిక్ సర్జరీ చేసుకొన్నట్టు అనుమానిస్తున్నారు.