Fuel price: పెట్రో ధరలు పెరిగితే సామాన్యుడి బతుకు భారమవుతుంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోయి కొనుగోలు శక్తి సన్నగిల్లుతుంది. ప్రస్తుతం దేశంలో పెట్రో ధరలు రూ.100 నుంచి 120 మధ్య ఉంటేనే సామాన్య ప్రజలు ధరల భారం మోయలేక సతమతమవుతున్నారు. పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లో పరిస్థితి ఇంతకంటే అధ్వాన్నంగా ఉంది. ఇక కరేబియన్ దేశం క్యూబా పరిస్థితి ఆ రెండు దేశాల కంటే అత్యంత దారుణంగా తయారైంది.
కరోనా వైరస్ తీసిన దెబ్బ, అమెరికా ఆంక్షలు కలగలిసి ఆ దేశాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి.
దాంతో ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు క్యూబా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పెట్రో ధరలను 500 శాతానికి పైగా పెంచుతున్నట్లు ప్రకటించింది. దాంతో ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఫిబ్రవరి 1 నుంచి పెట్రో ధరల పెంపు అమల్లోకి రానున్నట్లు క్యూబా సర్కారు వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర 25 క్యూబన్ పెసోలు (మన కరెన్సీలో సుమారు రూ.90) గా ఉన్నది. ఫిబ్రవరి 1 నుంచి అది 132 పెసోల (దాదాపు రూ.450) కు పెరగనుంది. ఇక ప్రీమియం పెట్రోల్ ధరలనైతే ప్రస్తుతం ఉన్న 30 పెసోల నుంచి 156 పెసోలకు పెంచనున్నట్లు క్యూబా ప్రకటించింది.
‘రానున్న రోజుల్లో డీజిల్, ఇతర ఇంధన ధరలు కూడా పెరగనున్నాయి. నివాస సముదాయాలకు విద్యుత్ ఛార్జీలను కూడా 25 శాతం పెంచుతున్నాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి చమురు కొనుగోలు చేసేందుకు విదేశీ కరెన్సీని పెంచుకోవాలని యోచిస్తున్నాం. అందుకోసం కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని అమెరికా డాలర్లలో మాత్రమే కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నాం’ అని క్యూబా ఆర్థిక మంత్రి రెగ్యురో చెప్పారు.
కాగా, తంలో క్యూబాలో ఇంధనాన్ని సబ్సిడీ ధరలకు విక్రయించేవారు. కరోనా మహమ్మారితో అక్కడి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. మరోవైపు ఇటీవలి కాలంలో క్యూబాపై అమెరికా ఆంక్షలను కఠినతరం చేసింది. ఫలితంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.