పారిస్: ఫ్రాన్స్‌లో (France) కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. ఒకేరోజు రికార్డు స్థాయిలో మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫ్రెంచ్ దేశంలో మంగళవారం 2 లక్షల 71 వేలపైచిలుకు కేసులు రికార్డవగా, గత 24 గంటల్లో 3 లక్షల 32 వేలకుపైగా మంది కరోనా బారినపడ్డారు. ఫ్రాన్స్‌లో ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. బుధవారం 2483 మంది దవాఖానాలో చేరారని, వారిలో 396 మంది ఐసీయూలో ఉన్నారని అధికారులు వెల్లడించారు.
దేశంలో ఇప్పటివరకు 1,09,21,757 కరోనా కేసులు నమోదవగా, 1,24,563 మంది మృతిచెందారు. మరో 83,35,903 మంది కరోనా నుంచి కోలుకోగా, 24,61,045 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, దేశవ్యాప్తంగా 20 శాతం మంది ఇంకా కరోనా టీకా తీసుకోలేదని అధికారులు తెలిపారు.