హ్యూస్టన్/హైదరాబాద్, సెప్టెంబర్ 4 : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన నలుగురిని భారతీయులుగా పోలీసులు గుర్తించారు. డల్లాస్ సమీపంలో ఓ హైవేపై ఆగి ఉన్న ఎస్యూవీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయింది. ఘటన జరిగినప్పుడు కారులో ఉన్న నలుగురు మరణించారు. వీరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో డీఎన్ఏ, ఇతర ఆధారాల ద్వారా నాలుగు రోజులకు పోలీసులు మృతులను గుర్తించారు. హైదరాబాద్కు చెందిన ఆర్యన్ రఘునాథ్ ఒరంపట్టి, ఫరూఖ్ షేక్, లోకేశ్ పలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవ్ ఈ ప్రమాదంలో మరణించినట్టు కొల్లిన్ కౌంటీ షెరిఫ్ కార్యాలయం ధ్రువీకరించింది. ఆర్యన్, ఫరూఖ్ ఇటీవలే టెక్సాస్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసుకున్నారు. లోకేశ్ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తున్నాడు. కార్పూలింగ్ యాప్ ద్వారా వీరు ప్రమాదం జరిగిన కారు ఎక్కినట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ) : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ యువకులు, తమిళనాడుకు చెందిన యువతి మరణించడంపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆర్యన్ రఘునాథ్, ఫరూక్ షేక్, లోకేశ్ పాలచర్ల, దర్శిని వాసుదేవన్ (తమిళనాడు) మరణవార్త తనను ఎంతగానో బాధించిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.