వాటికన్ సిటీ: క్రైస్తవ మత గురువు, మాజీ పోప్ బెనెడిక్ట్-16 కన్నుమూశారు. 95 ఏండ్ల వయసున్న ఆయన.. వృద్ధాప్యం, పలు అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి శనివారం ఉదయం 9 గంటలకు తుది శ్వాస విడిచారని వాటికన్ వర్గాలు వెల్లడించాయి. గురువారం సెయింట్ పీటర్స్ స్కేర్‌లో పోప్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపాయి.
అనారోగ్య కారణాలతో తాను పదవి నుంచి వైదొలుగుతున్నానని 2013, ఫిబ్రవరి 11న ప్రకటించి క్యాథలిక్ క్రైస్తవులను దిగ్భ్రాంతికి గురి చేశారు. వాటికన్ సిటీ 600 ఏండ్ల చరిత్రలో ఏ పోప్ కూడా మధ్యంతరంగా పదవి నుంచి వైదొలగలేదు. ఆయన వారసుడిగా ప్రస్తుతం పోప్ ఫ్రాన్సిస్ కొనసాగుతున్నారు.