వాషింగ్టన్: పాకిస్థాన్ రక్షణ దళాల అధిపతి అసీం మునీర్‌ను అరెస్ట్ చేయాలని, ఆ దేశాన్ని ‘ఉగ్రవాద ప్రాయోజిత రాజ్యం’గా ప్రకటించాలని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబిన్ మాట్లాడుతూ, అమెరికా పాకిస్థాన్ వైపు ఉండటంలో అర్థం లేదన్నారు.
అమెరికా పాక్‌ను అక్కున చేర్చుకోవడంలో వ్యూహాత్మక తర్కం ఏమీ లేదని చెప్పారు. అసీం మునీర్ అమెరికాకు వస్తే ఆయనను గౌరవించడానికి బదులు అరెస్ట్ చేయాలని అన్నారు. భారత్ పట్ల నిరుడు ప్రవర్తించిన తీరుకు ఆ దేశానికి అమెరికా క్షమాపణ చెప్పాలన్నారు. మనకు కావలసింది తెర వెనుక ప్రశాంతమైన దౌత్యమని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాపణ చెప్పడానికి ఒప్పుకోరని, అయితే ఒక వ్యక్తి అహంకారం కన్నా అమెరికా, ప్రపంచ ప్రజాస్వామిక దేశాల ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 4, 5 తేదీల్లో భారత్‌లో పర్యటించడం గురించి రూబిన్ మాట్లాడుతూ, పుతిన్‌కు భారత్ ఇచ్చిన గౌరవం అపూర్వమని చెప్పారు. ఇటువంటి పరిస్థితిని తీసుకురావడంలో ట్రంప్ పాత్రను ఉపేక్షించలేమన్నారు. భారత్, రష్యాలను ఏకం చేయడంలో ఆయన పోషించిన పాత్రకు కచ్చితంగా నోబెల్ బహుమతికి ఆయన అర్హుడేనని ఎద్దేవా చేశారు. భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమని, ఆ దేశానికి ఇంధనం అవసరమని చెప్పారు.