ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంపై భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు. అంతర్జాతీయంగా అంగీకరించిన స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యాను తొలగించడం వంటి ఆంక్షలు ఆర్థిక వినాశకార ఆయుధాలతో సమానమని రాజన్ అన్నారు.
ఉక్రెయిన్పై రష్యా దాడిని కచ్చితంగా ఖండించాలని, అదే సమయంలో ఈ ఆర్థిక ఆంక్షల వల్ల కలిగే ప్రమాదాన్ని కూడా తక్కువగా అంచనా వేయకూడదని చెప్పారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫైనాన్స్ నేర్పుతున్న రాజన్..
‘‘ఈ ఆంక్షలు పూర్తిగా అమలైతే.. ఇవి కూడా వినాశనాన్ని మిగిల్చే ఆయుధాలే. అవి మిలటరీ ఆయుధాల్లా బిల్డింగులు, బ్రిడ్జిలు కూల్చకపోవచ్చు. కానీ సంస్థలను, ఆర్థిక వ్యవస్థలను కూల్చడం ద్వారా జీవితాల్ని నాశనం చేస్తాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తాయి. అంతేకాదు, వీటిని మరీ ఎక్కువగా ఉపయోగిస్తే గ్లోబలైజేషన్ ద్వారా ప్రపంచం సాధించిన ప్రగతిని కూడా నాశనం చేస్తాయి’’ అని పేర్కొన్నారు.
పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా ఇప్పటికే రష్యా కరెన్సీ విలువ 50 శాతం వరకూ పడిపోయింది. ప్రజల జీవన విధానం తీవ్రంగా అతలాకుతలం అవుతోంది.