బీజింగ్: చైనాలో మాజీ బ్యాంక్ మేనేజర్‌కు మరణశిక్ష అమలు చేశారు. చైనా హురాంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లో జనరల్ మేనేజర్‌గా చేసిన బాయ్ తియాన్‌హుయికి ఇవాళ ఉదయం మరణశిక్ష(Execution) అమలు చేశారు. మేనేజర్ పదవిలో ఉన్న సమయంలో తియన్హుయి సుమారు 156 మిలియన్ల డాలర్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చైనా అధ్యక్షుడు జీ పిన్‌పింగ్ చాన్నాళ్ల నుంచి అవినీతి వ్యక్తులను శిక్షిస్తున్నారు. హురాంగ్ సంస్థకు చెందిన మాజీ చైర్మెన్ లాయి జియామిన్కు కూడా అవినీతి కేసులో మరణశిక్ష అమలు చేశారు. అతను సుమారు 253 మిలియన్ల డాలర్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
హురాంగ్ కంపెనీకి చెందిన అనేక మంది ఎగ్జిక్యూటివ్స్ కూడా అవినీతి కేసులు ఎదుర్కొంటున్నారు. తియాంజిన్ నెంబర్ 2 పీపుల్స్ కోర్టు ఆదేశాల ప్రకారం బాయ్‌కి మరణశిక్ష అమలు చేశారు. సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాతనే ఇవాళ తీర్పును అమలు చేశారు. బాయ్ వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మరణశిక్షను వ్యతిరేకిస్తూ దాఖలు చేసుకున్న అప్పీల్‌ను ఫిబ్రవరి 2024లో కొట్టిపారేశారు. 2014 నుంచి 2018 వరకు వివిధ హోదాల్లో బాయ్ పనిచేశారు.