వాషింగ్టన్: ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో లాయర్‌ను అమెరికాకు చెందిన ‘డునాట్‌పే’ సంస్థ అభివృద్ధి చేసింది. మనిషి పక్షాన ఇది కోర్టులో కేసు వాదించనుంది. లాయర్లకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ మేధ ఆధారంగా ఒక బోట్‌ను ఈ సంస్థ రూపొందించింది. వచ్చే నెల అమెరికాలోని ఓ కోర్టులో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఇది వాదనలు వినిపించబోతున్నది. అయితే, ప్రత్యక్షంగా ఎలాంటి రోబో ఉండదు. కోర్టుకు హాజరుకాదు. కోర్టుకు హాజరయ్యే ప్రతివాది తన సెల్ఫోన్లో ఈ యాప్ వేసుకోవడంతో పాటు, ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవాలి. కోర్టులో వాదనలను ఈ ఏఐ బోట్ విని ఎలా వాదించాలి, ఏ పాయింట్‌ను లేవనెత్తాలి వంటి సూచనలను కోర్టులో ఉన్న ప్రతివాదికి ఎప్పటికప్పుడు అందిస్తుంది.