న్యూయార్క్: అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని సోమవారం భారీ వానలు ముంచెత్తాయి. దీంతో ఆకస్మిక వరద సంభవించి న్యూజెర్సీ, న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చిక్కుకుపోయాయి. పలు చోట్ల సబ్వే మార్గాలు మూసుకుపోయాయి. పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. ప్రధాన రోడ్లపై మూడు అడుగుల వరకు వరద నీరు ప్రవహించింది. దీంతో కొన్ని చోట్ల అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పౌరులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు. కాగా, వరదలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ సబ్వే స్టేషన్లో ప్లాట్‌ఫాం వరద నీటిలో మునగగా, కొందరు ప్రయాణికులు రైలులో చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటున్నారు. మరొక వీడియోలో రైలులోకి నీరు చేరడంతో కొందరు ప్రయాణికులు రైలు సీట్లపై నిలబడి ఉన్నారు.