టెక్సాస్: అమెరికాలో డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. తనకు రెడ్ వైన్ సర్వ్ చేసేందుకు వచ్చిన ఎయిర్ హోస్టెస్‌ను గట్టిగా పట్టుకుని ఆమె మెడపై ముద్దు పెట్టుకున్నాడు. అంతేగాక ఆమెపై దాడి కూడా చేశాడు. ఫ్లైట్ కెప్టెన్‌కు మీల్స్ తీసుకెళ్లే ట్రేలోని ప్లేట్‌ను విరగ్గొట్టాడు. దాంతో అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మిన్నెయాపోలిస్ నుంచి అంకోరేజ్కు బయలుదేరిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన డేవిడ్ అలన్ బర్క్ (61) అనే ప్రయాణికుడు ఎక్కాడు. ఫ్లైట్ టేకాఫ్ కాకముందే ఎయిర్‌హోస్టెస్‌ను పిలిచి రెడ్ వైన్ అడిగాడు. కానీ టేకాఫ్‌కు వైన్ సర్వ్ చేయడం కుదరదని ఆమె చెప్పింది.
ఆ తర్వాత ఫ్లైట్ టేకాఫ్ కాగానే అదే ఎయిర్ హోస్టెస్.. అలన్ బర్క్‌కు రెడ్ వైన్ సర్వ్ చేసింది. ఆ తర్వాత మద్యం మత్తులోకి జారుకున్న అలన్ బర్క్ ఎయిర్ హోస్టెస్‌ను పిలిచి ముద్దు పెట్టమని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో గట్టిగా పట్టుకుని మెడపై ముద్దు పెట్టుకున్నాడు. కెప్టెన్ మీల్స్ తీసుకెళ్తున్న ట్రేలోని ప్లేట్‌ను విరగగొట్టాడు. ఘటన గురించి బాధితురాలు ఇతర ఫ్లైట్ సిబ్బందికి తెలియజేసింది.
దాంతో ఫ్లైట్ కెప్టెన్ డెల్టా ఎయిర్‌లైన్స్‌కు, లా ఎన్ఫోర్స్మెంట్కు ఘటన గురించి ఫిర్యాదు చేశాడు. విమానం అంకోరేజ్కు చేరుకోగానే పోలీసులు అతడిని అదపులోకి తీసుకున్నారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.