US Fire accident | అమెరికా ఓక్లహోమాలోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 1 నుంచి 13 ఏండ్ల మధ్య వయసున్న ఆరుగురు చిన్నారులు ఉన్నారు. బ్రోకెన్ యారో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసినా.. ఇంట్లోని వారి ప్రాణాలను కాపాడలేకపోయారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆత్మహత్య లేదా హత్య చేసుకునే ఆవకాశాలను కూడా కొట్టిపారేయలేమని బ్రోకెన్ యారో ఫైర్ చీఫ్ జెరేమీ మూర్ చెప్పారు. ఇంటి వెనుక భాగంలో ఉన్న గదిలో మంటలు చెలరేగి ఇంటికి వ్యాపించినట్లుగా భావిస్తున్నారు. మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాతే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని స్థానిక పోలీసులు చెప్తున్నారు. కాగా, ఇదే ఇంటి నుంచి తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇలాఉండగా ఇదే నెలలో అమెరికాలో మూడు సంఘటనలు జరిగాయి. ఉత్తర కరోలినాలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. ఓహియో ఘటనలో నలుగురు, ఇండియానాలో 10 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, గత మూడు నెలల్లో మూడు పెద్ద సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. షికాగోలో జూలై 4 న జరిగిన కాల్పుల్లో 6, మేరీల్యాండ్‌లో జూన్ 10 న జరిగిన కాల్పుల్లో 3, టెక్సాస్‌లో మే 24 న జరిగిన తుపాకీ కాల్పుల్లో 19 మంది హతమయ్యారు. అలాగే జూలై 18 న ఇండియానా గ్రీన్వార్డ్ పార్క్ మాల్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు, జూలై 11 న దక్షిణ కాలిఫోర్నియాలో ఓ మహిళ సహా ముగ్గురు, జూలై 4 న షికాగోలో ఆరుగురు, జూన్ 1న ఓక్లొహోమాలో నలుగురు చనిపోయారు.