న్యూఢిల్లీ : రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో దాడులను నిలిపివేసిన కొన్ని గంటలకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మళ్లీ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. మనం యుద్ధం చేయాల్సిన అవసరం రాదని ఆశిస్తున్నాను. కానీ వారికి మరో పెద్ద దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు. నాకు ఇంకా కచ్చితంగా తెలియదు. త్వరలోనే మీకు తెలుస్తుంది అని మంగళవారం వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. ఇరాన్‌కు అణ్వాయుధం ఉండటానికి మేము అనుమతించలేము.
అందుకే ఒప్పందం చేసుకోవడానికి వారికి పరిమిత సమయం ఇస్తున్నాము అని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌తో ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణను ట్రంప్ గట్టిగా సమర్థించుకున్నారు. విమర్శకులు భిన్నంగా చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు జరిగిన సైనిక చర్యకు చాలా ప్రజాదరణ లభించిందని ట్రంప్ అన్నారు. దీనికి ప్రజాదరణ ఉన్నా లేకపోయినా నేను దీన్ని చేయాల్సిందే అని ఆయన అన్నారు. ప్రపంచం పేలిపోకుండా కాపాడటానికే తాను ఈ చర్య తీసుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇరాన్‌పై మరోసారి సైనిక దాడి ఉండవచ్చని ఆయన సూచించారు. దాడిపై నిర్ణయం తీసుకోవడానికి కేవలం ఒక గంట దూరంలోనే ఉన్నానని ఆయన చెప్పారు.
ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో హొర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక హెచ్చరిక చేసింది. ఈ జలమార్గం మునుపటి స్థితికి ఎప్పటికీ తిరిగిరాదని, ఇరాన్ ఆమోదం లేకుండా దానిని తెరవగల శక్తి ఏదీ లేదని ఇరాన్‌కు చెందిన ఒక ఉన్నతస్థాయి చట్టసభ సభ్యుడు ప్రకటించారు.