కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడేండ్లకుపైగా జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ యుద్ధంలో ఇప్పటికే అనేక మంది సైనికులను కోల్పోయిన ఉక్రెయిన్ ఆర్మీని సిబ్బంది కొరత వేధిస్తున్నది. దీంతో రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్ సైనిక దళంలోని టెక్ ఉద్యోగాల్లో మహిళలను చేర్చుకోనున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ 13వ నేషనల్ గార్డ్ ఖార్టియా బ్రిగేడ్ తన అన్ని సోషల్ మీడియా ఖాతాల్లో ఓ సందేశాన్ని షేర్ చేసింది. నాజూకైన నియాన్ ఆకుపచ్చ లిపిలో ఉన్న ఆ సందేశంలో ‘ఆమె మనసే ఆమె బలం. ఆమె ఎంపిక ఖార్టియా’ అని రాసి ఉన్నది. మహిళా సైనికులను నియమించుకునేందుకు, వారిని ఉక్రెయిన్ మిలిటరీలోని టెక్ ఉద్యోగాల్లోకి ఆకర్షించేందుకు ఈ బ్రిగేడ్ పూనుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఉక్రెయిన్ మిలిటరీలో దాదాపు 10 లక్షల మంది సిబ్బంది ఉన్నప్పటికీ వారిలో మహిళా ఉద్యోగుల సంఖ్య దాదాపు 70 వేలు మాత్రమేనని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. 13వ ఖార్టియా బ్రిగేడ్ అనేది ఉక్రెయిన్ నేషనల్ గార్డ్‌లోని పోరాట బ్రిగేడ్.
35,000 మంది ఉక్రెయిన్ పిల్లలు అదృశ్యం!
వంద కాదు.. వెయ్యి కాదు.. దాదాపు 35,000 మంది ఉక్రెయిన్ పిల్లలు అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తున్నది. వీరంతా రష్యాలోగానీ, ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమిత ప్రాంతంలోగానీ ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ 35,000 మందిలో ఎక్కువ మందిని మిలిటరీ క్యాంప్‌నకు తరలించడమో లేదా రష్యా వాసులు దత్తత తీసుకోవడమో జరిగి ఉంటుందని యేల్ యూనివర్సిటీ భావిస్తున్నది.