America | న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఫానీ మే అనే అమెరికన్ కంపెనీ దాదాపు 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వీరిలో 200 మందిని నైతికత కారణాలపై కంపెనీ తొలగించింది. వీరిలో తెలుగువారే అత్యధికంగా ఉన్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి. ఫానీ మేలో పనిచేస్తున్న వీరందరినీ నైతికత కారణంపై బుధ, గురువారాలలో కంపెనీ తొలగించింది. మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్లో అక్రమాలకు, నిధుల దుర్వినియోగానికి వీరు పాల్పడినట్టు కంపెనీ అభియోగాలు మోపినట్టు తెలుస్తోంది.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) వంటి స్వచ్ఛంద సంస్థలతో కుమ్మక్కై కంపెనీ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు కంపెనీ ఆరోపిస్తోంది. ఇదే కుంభకోణానికి సంబంధించి యాపిల్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో కొందరు భారతీయ ఉద్యోగులను తొలగించడం గమనార్హం. ఈ కుంభకోణంలో తానా మాత్రమే కాక ఇతర సంస్థల ప్రమేయం కూడా ఉండవచ్చని సమాచారం.
ఈ ఏడాది జనవరిలో తానాకు సంబంధించిన ఇవే ఆరోపణలపై యాపిల్ కంపెనీ 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ అంటే తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఏదైనా స్వచ్ఛంద సంస్థకు విరాళాన్ని అందచేస్తే అంతే మొత్తాన్ని కంపెనీ కూడా ఆ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందచేస్తుంది. ఆ స్వచ్ఛంద సంస్థతో కుమ్మక్కైన ఉద్యోగి తాను ఇచ్చిన విరాళాన్ని వాపసు తీసుకుని తప్పుడు పద్ధతిలో ఈ డిడక్షన్స్ని పన్ను మినహాయింపు కోసం ఉపయోగించుకుంటున్నట్టు ఆరోపణలు వచ్చాయి.