బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 28, 2020 , 14:58:23

కూతురి న‌మ్మ‌క‌మే తండ్రి ప్రాణాలు కాపాడింది !

కూతురి న‌మ్మ‌క‌మే తండ్రి ప్రాణాలు కాపాడింది !

క‌రోనా నేప‌థ్యంలో హాస్పిట‌ల్‌లో చ‌నిపోయిన వ్య‌క్తుల‌ను డైరెక్టుగా మార్చురీకి పంపించేస్తున్నారు. ద‌గ్గ‌ర నుంచి చూసేందుకు కూడా కుటుంబ స‌భ్యుల్ని అనుమ‌తించ‌ట్లేదు. ఈ విధంగా కొలంబియాకు చెందిన ఓ వ్యక్తి హై బ్లడ్ ప్రెజర్‌తో బాధ‌ప‌డుతూ ఒక‌ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరాడు. వైద్యం చేసిన రెండు గంట‌ల త‌ర్వాత అత‌ను చ‌నిపోయాడంటూ వైద్యులు తెలియ‌జేశారు . క‌రోనా టైంలో డెడ్ బాడీని కూడా మీకు అప్ప‌గించమ‌ని చెప్పారు. దీంతో వారంతా మ‌రింత దుఃఖానికి గుర‌య్యారు. కానీ 67 ఏండ్ల జువాన్ జోస్ మునోజ్ రొమెరో‌ కుమార్తె మాత్రం తండ్రి చ‌నిపోయాడ‌ని న‌మ్మ‌లేదు. ఇంకా బ‌తికే ఉన్నాడంటూ వైద్యుల‌తో వాధిస్తున్న‌ది.

అయినా డాక్ట‌ర్లు వింటారా.. చ‌నిపోయిన త‌ర్వాత కూడా బాడీలో క‌ద‌లిక‌లు ఉంటాయ‌ని వారించారు. తండ్రి డెడ్‌బాడీని మార్చురీలోకి తీసుకెళ్తుండ‌గా డాక్ట‌ర్ల‌ను ప‌క్క‌కు నెట్టి మరీ తండ్రి వ‌ద్ద‌కు వెళ్లి చేయి ప‌ట్టుకొని నాన్నా అని గ‌ట్టిగా అరిచింది. అంతే.. ఒక్క పిలుపుతో పోయిన ప్రాణం తిరిగివ‌చ్చింది. ఉలిక్కిప‌డిన‌ట్లుగా లేచాడు. ఒక్క‌సారిగా అక్క‌డున్న‌వారంతా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జోస్ కొడుకు మార్టిన్ మాట్లాడుతూ 'నాన్న ఇస్కేమియాతో బాధపడుతున్నాడు. అత‌ను చ‌నిపోయాడ‌నే స‌రికి మా చెల్లి న‌మ్మ‌లేదు. ప్రాణాల‌తో ఉన్న‌ప్పుడు మార్చురీలోకి తీసుకెళ్తే మ‌రింత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని డాక్ట‌ర్ల‌ను అడ్డుకుని నాన్న‌ను క‌ద‌లించేస‌రికి క‌ళ్లు తెరిచాడు' అని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం జోస్‌కి మ‌రో హాస్పిట‌ల్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ హాస్పిట‌ల్ యాజ‌మాన్యంపై కేసు పెట్టేందుకు కుటుంబ స‌భ్యులు సిద్ధంగా ఉన్నారు.  


logo