ఏ లాజిక్కూ అందనిది ప్రేమ. ఎప్పుడు ఎలా పుడుతుందో.. ఎవరితో ప్రేమలో పడతారో తెలీదు. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు పెద్దలు. అయితే ప్రేమ గుడ్డితనానికీ ఓ శాస్త్రీయ కారణం ఉందని తేల్చారు ఆస్ట్రేలియా పరిశోధకులు. తప్పంతా ‘లవ్ హార్మోన్’గా పేరున్న ఆక్సిటోసిన్దేనని డీకోడ్ చేశారు.
సిడ్నీ: ఎప్పుడు ఎవరు.. ఎవరితో ప్రేమలో పడతారో తెలియదు. అందుకే ప్రేమ గుడ్డిది అని పెద్దలు అంటారు. అయితే, ఇందుకు ఓ శాస్త్రీయ కారణం ఉన్నదని ఆస్ట్రేలియా పరిశోధకులు తేల్చారు. మానవ మెదడు ప్రవర్తనా క్రియాశీల వ్యవస్థ, రొమాంటిక్ లవ్ మధ్య ఉన్న సంబంధంపై అధ్యయనం నిర్వహించి ప్రేమ గుడ్డిది ఎందుకైందో డీకోడ్ చేశారు. రొమాంటిక్ లవ్ అనేది మెదడులో మార్పునకు కారణమవుతుందని కనుగొన్నారు. ఎవరితోనైనా ప్రేమలో పడ్డప్పుడు లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ విడుదల కావడమే ఇందుకు కారణమని తేల్చారు.
ప్రేమలో ఉన్న 1,556 మంది యుక్త వయస్కులపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. భాగస్వామిపట్ల వారి భావోద్వేగ ప్రతిస్పందన, వారి ప్రవర్తన, అన్నింటికీ మించి వారికి ఇష్టమైన వారిపై వారుపెట్టే దృష్టిపై పరిశోధన చేశారు. మనం ప్రేమలో ఉన్నప్పుడు మన మెదడు భిన్నంగా స్పందిస్తుందని, ఈ సమయంలోనే ఎదుటి వ్యక్తిపై ఆప్యాయతలు, అనురాగాలు అమాంతం పెరుగుతాయని కనుగొన్నారు. ప్రేమ గుడ్డిది అనే అంశంపై ప్రపంచంలోనే ఇదే మొదటి పరిశోధన కావడం విశేషం.