న్యూయార్క్, నవంబర్ 7: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ ఇటీవల తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించడంతో ఇప్పుడు ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కూడా అదే బాటలో నడుస్తున్నది. త్వరలో అనేక మంది ఉద్యోగులను తొలగించేందుకు మెటా సిద్ధమవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెటాలో 87 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపవచ్చని, ఇందుకు సంబంధించి ఈ నెల 9న మెటా నుంచి ప్రకటన వెలువడవచ్చని ప్రముఖ పత్రిక ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొన్నది. ఈ వారంలో అత్యవసరం కాని ప్రయాణాలేమైనా ఉంటే వాటిని రద్దు చేసుకోవాలని మెటా అధికారులు ఇప్పటికే తమ ఉద్యోగులకు స్పష్టం చేసినట్టు వెల్లడించింది. ఒకేసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు మెటా పూనుకోవడం 18 ఏండ్ల ఆ కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. ట్విట్టర్‌తో పోలిస్తే మెటాలో ఉద్యోగుల తొలగింపు శాతం తక్కువగా ఉంటుందని, కానీ మెటా నుంచి ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగుల సంఖ్య మాత్రం ట్విట్టర్ కంటే ఎక్కువగానే ఉంటుందని పేర్కొన్నది. ఈసారి మూడో త్రైమాసికంలో మెటా సాధించిన ఆర్థిక ఫలితాలు ఆ కంపెనీ వాటాదారులను తీవ్రంగా నిరాశపర్చాయి. దీంతో 2023 వరకు సంస్థలో ఉద్యోగుల సంఖ్యను పెంచబోమని, స్వల్పంగా తగ్గించే అవకాశం ఉన్నదని మెటా సీఈవో జుకర్‌బర్గ్ తమ వాటాదారులకు తెలిపారు.