ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ తప్పులో కాలేసింది. యూజర్లకు తాను విధించే రూల్స్‌ను స్వయంగా తానే బ్రేక్ చేసింది. అది ఎలాగో తెలుసా? ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ పేరిట ఉన్న ఒక ఫేస్బుక్ పేజ్‌ను వెరిఫై చేయడం ద్వారా. ఒక విధంగా ఫేస్బుక్ సంస్థకు మస్క్‌కు పెద్దగా పడదని సోషల్ మీడియాలో చెప్పుకుంటారు.
గతంలో ఈ కంపెనీకి చెందిన వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ రూల్స్ తెచ్చినప్పుడు ఆ యాప్ వాడకం ఆపేయాలని మస్క్ చెప్పిన సంగతి తెలిసిందే. వాట్సాప్ బదులు అలాగే పనిచేసే ‘సిగ్నల్’ వాడాలని మస్క్ చేసిన ట్వీట్‌తో లక్షలాది మంది వాట్సాప్ వినియోగదారులు తమ ఖాతాలను డిలీట్ చేశారు.
అలాంటి మస్క్ పేరిట ఏర్పాటైన ఒక ఫేస్బుక్ పేజ్ ఒరిజినల్ అంటూ బ్లూ టిక్ ఇచ్చింది ఫేస్బుక్ కంపెనీ. కానీ నిజానికి ఆ ఫేస్బుక్ పేజ్‌తో మస్క్‌కు ఎలాంటి సంబంధమూ లేదు. 2019 జూలై 28న ఈ పేజ్‌ను తయారు చేశారు. ఈ ఏడాదిలో ఆరుసార్లు ఈ పేజ్ పేరు మార్చారు. దీన్ని ఈజిప్టు నుంచి మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం.
మస్క్ నివసించేది టెక్సాస్‌లో మరి ఈజిప్టు నుంచి ఈ పేజ్ ఎలా మెయింటైన్ చేస్తాడు? మస్క్ ఫొటోతో ఉన్న ఈ పేజ్‌ను 1.53 లక్షల మంది ఫాలో చేస్తున్నారు. ఇది మస్క్ వ్యక్తిగత ఫేస్బుక్ పేజ్ అనే భ్రమ కలిగేలా దీన్ని తయారు చేశారు.
ఈ పేజ్ తయారు చేసిన వ్యక్తి కొంతకాలం క్రితం ఉచితంగా బిట్‌కాయిన్స్ ఇస్తానంటూ చాలా మందిని మోసం చేసినట్లు సమాచారం. ఇలాంటి పేజ్‌ను ఎలా వెరిఫై చేస్తారంటూ ఫేస్‌బుక్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన తర్వాత ఈ పేజ్‌ను ఫేస్బుక్ నుంచి తొలగించారు.
ఫేస్బుక్ బ్లూటిక్ పాలసీ ప్రకారం, ఖాతాను వెరిఫై చేయాలంటే ఒక ఫామ్ ఫిలప్ చేయాలి. దాంతోపాటు పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ట్యాక్స్ ఫిల్లింగ్, ఏవైనా బిల్లులు, లేదంటే కంపెనీలకు సంబంధించిన పత్రాలు వంటివి సమర్పించాలి. అలాంటివేమీ లేకుండా ఎలన్ మస్క్ పేరిట ఉన్న పేజ్‌ను ఫేస్బుక్ ఎలా వెరిఫై చేసిందో మరి.