Explosion @ Kabul | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ భవనం వెలుపల జరిగింది. పేలుడు జరిగిన సమయంలో తాలిబాన్-చైనా అధికారుల మధ్య సమావేశం జరుగుతున్నది. ఈ ఘటనపై విదేశాంగ మంత్రిత్వశాఖగానీ, అంతర్గత వ్యవహరాల మంత్రిత్వశాఖగానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో దాదాపు 20 మంది దుర్మరణం చెందారు. అయితే, దీనిని తాలిబాన్ ప్రభుత్వం ఇంతవరకు ధ్రువీకరించలేదు.
బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాబూల్‌లోని విదేశాంగ మంత్రిత్వశాఖ భవనం ఆవల పేలుడు, కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పినట్లు పోలీసు ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. ఇటీవలి నెలల్లో రష్యా, పాకిస్తాన్ రాయబార కార్యాలయాలు, మాజీ ప్రధానుల కార్యాలయాలతో సహా కీలకమైన ఇన్స్టాలేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్న ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల తిరుగుబాటును తాలిబాన్ పాలకులు ఎదుర్కొంటున్నారు. పేలుళ్లకు, కాల్పులకు తమదే బాధ్యత అని ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదు.
అంతకుముందు జనవరి 1న కాబూల్‌లోని సైనిక విమానాశ్రయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. డిసెంబర్ 29న కూడా తాలూకాన్ ప్రావిన్స్‌లో పేలుడు సంభవించగా.. నలుగురికి గాయాలయ్యాయి. డిసెంబర్ 26న బదక్షన్ ప్రావిన్స్‌లో జరిగిన పేలుడులో ఒక పోలీసు అధికారి మరణించారు. డిసెంబర్ 12 న చైనీస్ హోటల్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. ఇద్దరు విదేశీయులకు తీవ్రగాయాలయ్యాయి.