రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవాలని కూడా ఈ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్ (ఈయూ) చీఫ్ ఉర్సులా వాన్ డర్ లెయెన్.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో ఆమె భేటీ అవనున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో ఉక్రెయిన్ను పునరుద్ధరణకు అవసరమైన చర్యలు, దానికి పశ్చిమ దేశాల సహాయం గురించి చర్చించనున్నట్లు చెప్తున్నారు. అలాగే ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇచ్చే విషయంలో ఎంత వరకు పురోగతి సాధించామనే విషయాన్ని కూడా ఉర్సులా వివరిస్తారట. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఈయూ చీఫ్ ఇలా ఉక్రెయిన్‌కు రావడం ఇది రెండోసారి.