జెరూసలేం, జూన్ 15: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మూడో రోజు కూడా దాడులు, ప్రతి దాడులు కొనసాగాయి. ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రమైన సౌత్‌పార్స్ క్షేత్రంపై ఇజ్రాయెల్ ఆదివారం దాడి చేసి ఇరాన్‌ను భారీగా దెబ్బతీసింది. ఇరాన్ అణు కేంద్రాలు సహా 150కి పైగా లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ దాడులతో 11 నిల్వ ట్యాంక్‌లు ఒకదాని వెంట మరొకరి భారీ శబ్దంతో పేలిపోతుంటడంతో పెద్దయెత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అగ్నికీలలు సమీప ప్రాంతాలకు కూడా వ్యాపించి భారీ నష్టం వాటిల్లింది.
టెల్ అవీవ్ దాడుల్లో షహ్రాన్లోని భారీ గ్యాస్ క్షేత్రం కూడా ధ్వంసమైనట్టు ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ అధికారులు ధ్రువీకరించారు. గ్యాస్క్షేత్రాల భస్మీపటలంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన వైమానిక, రక్షణ స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖను లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ వాయు రక్షణ వ్యవస్థను చీల్చుకుని పలు నగరాలపై దాడులు జరిపింది.
ఇరాన్ ఆదివారం జరిపిన దాడిలో ఇజ్రాయెల్‌లో 10 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 14కు చేరింది. కాగా, ఇరాన్లో తాజాగా ఎంతమంది మృతి చెందినదీ ఆ దేశం అధికారికంగా వెల్లడించ లేదు. అయితే శనివారం నాటికి 78 మంది మరణించగా, 320 మంది గాయపడ్డట్టు ఆ దేశ దౌత్య అధికారి తెలిపారు. కాగా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్లో 406 మంది మరణించగా, 654 మంది గాయపడ్డట్టు హ్యూమన్ రైట్స్ గ్రూప్ తెలిపింది.
ఇరాన్‌పై దాడికి అగ్రరాజ్యం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు తెలపడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియన్ తీవ్రంగా దుయ్యబట్టారు. ఇజ్రాయెల్ కనుక దాడులు ఇలాగే కొనసాగిస్తే తమ ప్రతిస్పందన నిర్ణయాత్మకంగా, తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. అమెరికా అనుమతి లేకుండా ఇలాంటి దాడికి దిగే సామర్ధ్యం ఇజ్రాయెల్‌కు లేదని అన్నారు. కాగా, పాలన మార్పు తమ లక్ష్యం కాదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ తెలిపారు.
ఆత్మరక్షణ కోసమే తాము దాడులు చేస్తున్నామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ చెప్పారు. ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తామూ వాటిని నిలిపివేస్తామని, ఇజ్రాయెల్ చర్యలకు భాగస్వామిగా ఉన్న అమెరికా దాడులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
మిలిటరీ ఆయుధాల తయారీ ఫ్యాక్టరీల నుంచి ఇరాన్ పౌరులు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ మిలిటరీ ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు మిలిటరీ ప్రతినిధి కర్నల్ అవిచాయ్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ రానున్న కాలంలో తాము వీటిపై దాడి చేసే అవకాశాన్ని తెలియజేశారు.
ఇజ్రాయెల్‌లో పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. ‘ఉద్దేశపూర్వకంగా చేసిన పౌరులు, మహిళలు, పిల్లల హత్యలకు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. వారిపై అధిక శక్తితో దాడి చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.