దుబాయ్: ఈ రోజుల్లో ఓ ప్రోడక్టో, సర్వీసో తీసుకురావడం గొప్ప కాదు.. దానిని ఎలా మార్కెటింగ్ చేసి జనాల్లోకి తీసుకెళ్తున్నామన్నదే ముఖ్యం. దీనికోసం కంపెనీలు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నాయి. తమ ప్రోడక్ట్ లేదా సర్వీస్ పట్ల జనం ఆకర్షితులయ్యేలా చేయడానికి నానా తిప్పలు పడుతున్నాయి. తాజాగా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ( Emirates ) చేసిన ఓ యాడ్ ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచంలోనే ఎత్తయిన బిల్డింగ్, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ఓ అమ్మాయిని నిలబెట్టి ఈ యాడ్ షూటింగ్ చేయడం విశేషం. ఈ 30 సెకన్ల యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రొఫెషనల్ స్కైడైవింగ్ ఇన్స్ట్రక్టర్ అయిన నికోల్ స్మిత్-లుడ్విక్ ఈ యాడ్‌లో కనిపించింది.
యాడ్ మొదట్లో ఎమిరేట్స్ యూనిఫామ్‌లో ఉన్న నికోల్‌ను క్లోజప్‌లో చూపించారు. ఆమె ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌ను ప్రమోట్ చేసే కొన్ని ప్లకార్డులు పట్టుకొని కనిపిస్తుంది. ఆ తర్వాత మెల్లగా కెమెరా దూరం జరుగుతుంటే.. అసలు ఆమె ఎక్కడ నిల్చున్నదీ తెలుస్తుంది. ఈ వీడియో చూసి చాలా మంది నెటిజన్లు ముక్కున వేలేసుకున్నారు. అయితే ఈ యాడ్‌ను ఎలా చిత్రీకరించారు? దీని కోసం ఎంత ప్రయాస పడ్డారో మరో వీడియోలో ఎమిరేట్స్ చూపించింది. నికోల్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు. 828 మీటర్ల ఎత్తుతో భూమిపై అతి ఎత్తయిన భవనంగా బుర్జ్ ఖలీఫాకు పేరుంది.