Elon Musk | న్యూయార్క్: గత వారం ఏం పనులు చేశారో చెప్పాలని డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ 48 గంటల డెడ్‌లైన్ విధించడం వేలాది అమెరికా ఫెడరల్ ఉద్యోగులను అయోమయంలో పడేసింది. ‘అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఫెడరల్ ఉద్యోగులందరికీ త్వరలోనే ఒక ఈమెయిల్ వస్తుంది. దీనికి స్పందించడంలో విఫలమైనవారు రాజీనామా చేసినట్టు పరిగణిస్తాం’ అని మస్క్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఈ మెయిల్ వచ్చిన కొద్ది సేపటికే ఉద్యోగులందరికీ గత వా రం పనుల గురించి అయిదు బుల్లెట్ పాయింట్లలో వివరించాలని.. సీసీ కాపీ మేనేజర్‌కూ పంపాలని.. సోమవారం అర్ధరాత్రి 11. 59లోగా ఈ పని చేయాలని ఈ మెయిల్ వచ్చింది. మస్క్ నుంచి వచ్చిన ఈ అసాధారణ ఆదేశం జాతీయ వాతావరణ సేవల విభాగం సహా పలు శాఖల్లో గందరగోళాన్ని సృష్టించిం ది.
మస్క్ అల్టిమేటం ఇవ్వడాన్ని అమెరికా ప్ర భుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు ఎవరెట్ట్ కెల్లీ వెంటనే ఖండించారు. ఫెడరల్ ఉద్యోగుల పట్ల, అమెరికన్లకు కీలక సేవలందించే విభాగా ల పట్ల మస్క్, ట్రంప్ అసహ్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ సామర్థ్య విభాగాధిపతిగా మస్క్ నియమితులైనప్పటి నుంచి వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు.