ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం గురించి ఇటీవల ఆయన చేసిన ట్వీట్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. రష్యా ఆక్రమించాలని చూస్తున్న ప్రాంతాల్లో ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించాలని, అక్కడ ప్రజలు చెప్పిన తీర్పును అందరూ శిరసావహించాలని మస్క్ చెప్పాడు.
దీనిపై పలువురు మస్క్‌ను తప్పుబట్టి తిట్టిపోశారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు తన కంపెనీ నుంచి పంపిన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు తమకు భారంగా మారాయని మస్క్ ట్వీట్ చేశాడు. ఉక్రెయిన్‌కు పంపిన స్టార్‌లింక్ టర్మినల్స్ వల్ల కంపెనీకి 80 మిలియన్ డాలర్లపైగా భారం పడిందని, అదికాక ప్రతినెలా 20 మిలియన్ల వరకూ ఖర్చవుతోందని మస్క్ చెప్పాడు.
ఇది తమ కంపెనీకి చాలా భారంగా ఉంటోందన్న అతను.. అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో తమకు సాయం చేయాలని కోరాడు. ఇదే విషయాన్ని చెప్తూ ఇటీవలే అమెరికా ప్రభుత్వానికి లేఖ కూడా పంపినట్లు చెప్పాడు.
‘ఇప్పటి వరకు పెట్టిన ఖర్చను తిరిగివ్వాలని స్పేస్ఎక్స్ అడగటం లేదు. అయితే నిరవధికంగా ఇలా స్టార్‌లింక్ సేవలు అందించడం చాలా కష్టం. అంతేకాక, సాధారణంగా ఇళ్లలో ఉపయోగించుకునే దాని కన్నా వందరెట్లు వేగంగా పనిచేసే టర్మినల్స్‌ను వేలకొద్దీ పంపడం కూడా అసాధ్యం’ అని మస్క్ చెప్పాడు.
SpaceX is not asking to recoup past expenses, but also cannot fund the existing system indefinitely *and* send several thousand more terminals that have data usage up to 100X greater than typical households. This is unreasonable.
— Elon Musk (@elonmusk) October 14, 2022