Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ అరుదైన కలయికలో రూపొందిన భారీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఇప్పటికే సంక్రాంతి రేసులో హాట్ ఫేవరెట్‌గా మారింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి నిర్మించగా, నయనతార మరియు కేథరిన్ ట్రెసా కథానాయికలుగా నటిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో వెంకటేష్ కీలకమైన ప్రత్యేక పాత్రలో సుమారు 45 నిమిషాల నిడివితో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో కనిపించే స్వాగ్, స్టైల్, టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిరు స్టైల్‌కు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఎలివేషన్ కలవడంతో తెరపై ఒక కొత్త ఫ్రెష్ ఫీల్ కనిపిస్తుందని అంటున్నారు. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ‘అల్టిమేట్ మెగా స్వాగ్’ హుక్ స్టెప్ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ పాటలో చిరంజీవి స్టైలిష్ లుక్, ప్రత్యేక కాస్ట్యూమ్స్, యాక్సెసరీస్‌తో అదిరిపోయే ప్రెజెన్స్‌ను చూపించారు. ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తూ, వయసు సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపించారు. ఈ పాటకు ప్రత్యేకంగా రూపొందించిన హుక్ స్టెప్ సింపుల్‌గా ఉంటూనే ట్రెండీగా ఉండటం విశేషం. థియేటర్లలో ఈ స్టెప్‌కు విజిల్స్, అరుపులు ఖాయమని ఫ్యాన్స్ ఇప్పటికే అంచనా వేస్తున్నారు.
బాబా సెహగల్ వాయిస్‌తో ఈ పాటకు ఓ నాస్టాల్జిక్ టచ్ వచ్చిందని సంగీత ప్రియులు అంటున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలన్నీ చార్ట్బస్టర్లుగా నిలవగా, ఈ హుక్ స్టెప్ సాంగ్ మాత్రం మెగా–విక్టరీ కాంబినేషన్‌కు తగ్గట్లుగా ప్రత్యేక మాస్ ఫీలింగ్‌ను తీసుకొచ్చిందని టాక్. అనిల్ రావిపూడి చిరంజీవి అభిమానిగా ఈ సినిమాను తెరకెక్కించడంతో, మెగా బాస్‌కు ఇచ్చిన ఎలివేషన్లు ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధమవుతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తూ, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.