Grok Chatbot | కేంద్రం విధించాలనుకొంటున్న ఆంక్షలపై ‘గ్రోక్’ ఎంతమాత్రం భయపడటం లేదు. కేంద్రంపై దీటుగా పోరుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ‘గ్రోక్’ మాతృ సంస్థ అయిన ‘ఎక్స్’ కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక హైకోర్టులో ఇటీవల వేసిన ఓ కేసు ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ)ని సాకుగా చూపుతూ ఎక్స్‌లో ఉన్న నిర్దిష్ట సమాచారాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం తమకు ఆదేశాలు జారీ చేసిందని ఈ ఫిర్యాదులో ఎక్స్ ఆరోపించింది. ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ‘ఆన్లైన్లో భావ స్వేచ్ఛా ప్రకటన’ తీర్పునకు వ్యతిరేకమని వాదించింది. కేంద్రం ఈ సెక్షన్‌ను వాడుకొని ఎక్స్‌లో ఏ సమాచారం ఉండాలో, ఏది తీసేయాలో నిర్ణయిస్తున్నదని ఆరోపించింది. ఎక్స్‌లో ఉన్న సమాచారాన్ని బ్లాక్ చేయిస్తున్నదని విమర్శించింది. తమ కంటెంట్‌పై నిర్ణయం తీసుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎక్స్ వాదించింది. రేప్పొద్దున ‘గ్రోక్’ విషయంలోనూ కేంద్రం ఏకపక్షంగా వెళ్తే.. సదరు చాట్‌బాట్ యంత్రాంగం కూడా కోర్టులను ఆశ్రయించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ, మోదీకి సంబంధించి కమలదళం సాగించిన అసత్య ప్రచారం తమను ఎలా ప్రభావితం చేసిందన్న భావన యువతలో, నెటిజన్లలో ఇప్పుడు పెద్దయెత్తున వ్యక్తమవుతున్నది. అందుకే, గ్రోక్ ఇచ్చే సమాధానాలను నెటిజన్లు స్వాగతిస్తున్నారు. ‘గ్రోక్’ సూటిగా, నిర్భయంగా సమాధానాలు ఇస్తుందని ప్రశంసిస్తున్నారు. బీజేపీ విషయంలో ఇప్పటివరకూ జరిగిన ప్రచారం నకిలీదని, గ్రోక్ తమ కండ్లు తెరిపిస్తున్నదని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
యువతలో కనువిప్పు కలిగితే తమ ఉనికికే ప్రమాదం జరుగొచ్చన్న భయంతో బీజేపీ ‘గ్రోక్’ను నిలువరించడానికి ప్రయత్నాలను మొదలుపెట్టింది. అన్నామలై ప్లకార్డులు, కేసులు ఇందులో భాగమే. అయితే, అవి విజయవంతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ‘గ్రోక్’ యజమాని ఎలాన్ మస్క్. ట్రంప్ కార్యవర్గంలో కీలక నేత. మస్క్ ఏం చెప్తే, ట్రంప్‌నకు ఇప్పుడు అదే వేదవాక్కు అన్నట్టు నడుస్తున్నది. అమెరికాను పరోక్షంగా నడిపిస్తున్న వ్యక్తిగా మస్క్‌ను మీడియా కీర్తిస్తున్నది కూడా. ట్రంప్‌తో సత్సంబంధాల కోసం మోదీ అర్రులు చాస్తున్నారు. అది జరుగాలంటే మస్క్‌ను కూడా ప్రసన్నం చేసుకోవాల్సిందే. అయితే, ఇప్పుడు మస్క్‌కు చెందిన ‘గ్రోక్’తో తలగోక్కుంటే అది బీజేపీకే నష్టాన్ని తీసుకురావొచ్చు. ఇది మోదీకి తెలియంది కాదు. మరోవైపు, ఇండియన్ చట్టాలు భారత పరిధిలోనే వర్తిస్తాయి. విదేశీ గడ్డ నుంచి పోస్టులు చేస్తే మోదీ సర్కారు కూడా ఏమీచేయలేని పరిస్థితి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. వెరసి ‘గ్రోక్’ను బీజేపీ దూకుడుగా ఎదుర్కోవడం అసాధ్యమని అభిప్రాయపడుతున్నారు.
‘గ్రోక్’ అనే ఆంగ్ల పదానికి ‘ఎవరైనా/ఏదైనా అంశాన్ని లోతుగా అవగతం చేసుకోవడం’ అనే అర్థం ఉన్నది. రాబర్ట్ ఏ హెన్లీన్ అనే రచయిత తన సైన్స్ ఫిక్షన్ నవల ‘స్ట్రేంజర్ ఇన్ ఏ స్ట్రేంజ్ ల్యాండ్’లో తొలుత ఈ గ్రోక్ అనే పదం వాడారు. ఈ ‘గ్రోక్’ పదం నుంచి స్ఫూర్తి పొందిన మస్క్ తన ఎక్స్ఏఐ టూల్‌కు ‘గ్రోక్’గా నామకరణం చేశారు. ఇప్పుడు ఆ గ్రోక్.. తన పేరుకు తగ్గట్టుగానే బీజేపీ అసలు స్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకొనేలా సాయపడుతుండటం గమనార్హం.