Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసిన ‘డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న్మెంట్ ఎఫిషియెన్సీ’(డోజ్) విభాగం అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి (Nobel Peace Prize) నామినేట్ అయ్యారు. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం కోసం మస్క్ అభ్యర్థిత్వానికి సంబంధించిన పిటిషన్ నోబెల్ కమిటీకి (Norwegian Nobel Committee) చేరింది. ఈ విషయాన్ని యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్ (Branko Grims) ధ్రువీకరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ నామినేషన్‌ను సమర్పించినట్లు వెల్లడించారు.
సేవకు పట్టం నోబెల్
ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతి. ఈ నోబెల్ బహుమతిని డైనమేట్‌ను కొనుగొన్న విఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ప్రారంభించారు. వైద్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి విభాగాల్లో ఈ బహుమతిని అందజేస్తారు. 1968లో స్వీడన్ బ్యాంక్ 300వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతిని ఏర్పాటు చేసి, 1969 నుంచి ప్రదానం చేస్తున్నారు. దీన్ని నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్‌గా పిలుస్తారు. నోబెల్ బహుమతులను డిసెంబర్ 10న నోబెల్ వర్ధంతి సందర్భంగా స్టాక్‌హోంలో ప్రదానం చేస్తారు.
–నోబెల్ బహుమతికి ప్రారంభంలో 1,50,782 స్వీడిష్ క్రోనార్లు ఇచ్చేవారు. ప్రస్తుతం 80 లక్షల స్వీడిష్ క్రోనార్లు (సుమారు రూ.6.7 కోట్లు) ఇస్తున్నారు.
–ప్రతి ఏడాది నోబెల్ బహుమతిని ఒక్కో రంగంలో గరిష్టంగా ముగ్గురికి ఇస్తారు.
–ప్రతి ఏడాది ముందుగా వైద్యరంగంలో.. ఆ తర్వాత వరుసగా భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, శాంతి, అర్థశాస్త్రం, సాహిత్యరంగాల్లో ప్రదానం చేస్తారు.
–ఆల్ఫ్రెడ్ నోబెల్ కృషిని గుర్తిస్తూ అతని పేరు మీద కృత్రిమ మూలకానికి నోబెలియమ్ అని పేరు పెట్టారు.
–1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధంవల్ల, 1939 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధంవల్ల, కొన్ని ప్రత్యేక కారణాలవల్ల నోబెల్ బహుమతిని కొన్ని విభాగాల్లో ఇవ్వలేదు.
Also Read..
Alex Soros | బంగ్లాదేశ్‌కు నిధులు నిలిపివేసిన ట్రంప్.. యూనస్‌తో జార్జ్ సోరస్ కుమారుడి భేటీ
Airplane Crash | హెలికాప్టర్‌ను ఢీకొట్టిన విమానం.. 18 మంది మృతి