Elon Musk | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అంటూ ఆయన ఇచ్చిన నినాదానికి అమెరికన్లు ఓట్ల వర్షం కురిపించారు. దీంతో అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. ఇక ట్రంప్ గెలుపు వెనుక అమెరికన్ టైకూన్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఉన్న విషయం తెలిసిందే. యూఎస్ ఎన్నికల సందర్భంగా తొలి నుంచి ట్రంప్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.
ఇక ట్రంప్ గత రాత్రి గ్రాండ్ విక్టరీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో క్లబ్లో ఎన్నికల నైట్ పార్టీలో ట్రంప్ ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి సంబరాలు చేసుకుంది. ఈ విక్టరీ సెలబ్రేషన్స్‌లో ఎలాన్ మస్క్ కూడా చేరిపోయారు. తన నాలుగేళ్ల కుమారుడితో.. ట్రంప్ ఫ్యామిలీతో ఫొటోలకు ఫోజులిచ్చారు (Musk in Trump familys victory photo). ఇందుకు సంబంధించిన ఫొటోను ట్రంప్ మనవరాలు కై ట్రంప్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ‘ది హోల్ స్క్వాడ్’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ మిస్సవడం గమనార్హం. అదే సమయంలో మస్క్ సైతం తన కుమారుడిని తన భుజాలపై ఎత్తుకుని ఉన్న ఫొటోను ఎక్స్‌లో పోస్టు చేశారు.
The whole squad pic.twitter.com/5yQVkFiney
— Kai Trump (@KaiTrumpGolfs) November 6, 2024
కాగా, అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ (Elon Musk) మొదటి నుంచి తన పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఆయన గెలుపుకై తీవ్రంగా కృషి చేశారు. ట్రంప్‌ను మస్క్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు. ట్రంప్‌ను గెలిపించేందుకు ఈ టెక్ ది గ్గజం చేసిన హంగామా ఈసారి ఎన్నికల హైలైట్‌గా నిలిచింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మస్క్‌కు కీలక పదవి ఇస్తానని ట్రంప్ వెల్లడించారు. తన కేబినెట్లో చోటు కల్పిస్తానని (Cabinet position) చెప్పారు. అలా కానిపక్షంలో సలహాదారుడిగానైనా (advisory role) నియమించుకుంటానని గతంలో స్పష్టం చేశారు. ట్రంప్ ఆఫర్‌పై ఎలాన్ మస్క్ కూడా అప్పుడే సానుకూలంగా స్పందించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీకి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తన మనసులో మాటను వెల్లడించారు.
Novus Ordo Seclorum pic.twitter.com/RKTU7pATXl
— Elon Musk (@elonmusk) November 7, 2024
ఇది అమెరికాకు స్వర్ణయుగం: ట్రంప్
తన గెలుపు అమెరికాకు స్వర్ణయుగం అవుతుందని, అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకు ఈ విజయం ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం అనంతరం బుధవారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘నన్ను 47వ అధ్యక్షుడిగా ఎన్నుకున్న అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు. ఇవాళ మనం చరిత్ర సృష్టించాం. ప్రతీ పౌరుడి కోసం నేను పోరాడతా. ఇది అమెరికాకు స్వర్ణయుగం అవుతుంది. మన సరిహద్దులను సరి చేస్తా. దేశ సమస్యలను పరిష్కరిస్తా. అమెరికాను మళ్లీ సురక్షితమైన, బలమైన, శక్తిమంతమైన, స్వేచ్ఛాయుతమైన దేశంగా మారుస్తా. నేను యుద్ధాలను ప్రారంభించను. యుద్ధాలను ఆపేస్తా.’ అని ఆయన పేర్కొన్నారు. తన ప్రసంగంలో బిలియనీర్ ఎలన్ మస్క్‌ను ట్రంప్ మెచ్చుకున్నారు. రిపబ్లికన్ పార్టీలో మస్క్ ఓ కొత్త నక్షత్రం అని పేర్కొన్నారు. మస్క్ ఓ మంచి వ్యక్తి అని ట్రంప్ తన విక్టరీ ప్రసంగంలో తెలిపారు.
Also Read..
Donald Trump | ఇప్పుడు గెలిచినా.. వచ్చే ఏడాదే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం..!
US President | అమెరికా అధ్యక్షుడి జీతం.. ఇతర సౌకర్యాల గురించి తెలుసా..?
Saudi Arabia | ఎడారిలో మంచు వర్షం.. చరిత్రలోనే తొలిసారి.. ఫొటోలు, వీడియోలు వైరల్