అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చురకలేశాడు. తాజాగా బైడెన్ చేసిన ఒక ట్వీట్లో ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తూ, ఉద్యోగాలు సృష్టిస్తున్నాయంటూ ఫోర్డ్, జీఎం కార్ల కంపెనీలను కొనియాడారు.
‘‘ఫోర్డ్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల్లో 11 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోంది. దేశవ్యాప్తంగా 11వేల ఉద్యోగాలు కల్పిస్తోంది. జీఎం కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా విద్యుత్ వాహనాల తయారీలో 7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి, మిచిగాన్‌లో 4వేల ఉద్యోగాలు సృష్టిస్తోంది’’ అంటూ బైడెన్ ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ వచ్చింది.
అయితే అమెరికాలో అత్యంత ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తున్న, అమ్ముతున్న కంపెనీ టెస్లా. ఎలన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీని జోబైడెన్ గతంలో కూడా పట్టించుకోలేదు. ఈ విషయంలో పలుమార్లు మస్క్ విమర్శలు చేశారు. ఆ తర్వాత ఒక ఉపన్యాసంలో టెస్లా కంపెనీని కూడా బైడెన్ ప్రస్తావించారు.
గత నెలలో జనరల్ మోటార్స్ (జీఎం) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మేరీ బారాతో బైడెన్ భేటీ అయ్యారు. వారిద్దరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత.. విద్యుత్ వాహనాల తయారీలో జీఎం కృషిని బైడెన్ మెచ్చుకున్నారు. ఆ సమయంలో బైడెన్‌పై మరోసారి మస్క్ తీవ్రమైన విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా బైడెన్ చేసిన ట్వీట్‌పై మస్క్ స్పందించాడు. ‘‘టెస్లా ఇప్పటి వరకు 50 వేల అమెరికన్ ఉద్యోగాలు కల్పించింది. జీఎం, ఫోర్డ్ కలిపి పెట్టిన పెట్టుబడికి రెండింతలు పెట్టుబడులు పెట్టింది. (ఈ ట్విట్టర్‌ను నియంత్రించే వ్యక్తి సమాచారం కోసం)’’ అంటూ చురకలంటించాడు మస్క్.
Tesla has created over 50,000 US jobs building electric vehicles & is investing more than double GM + Ford combined
[fyi to person controlling this twitter]
— Elon Musk (@elonmusk) March 2, 2022