న్యూఢిల్లీ, మార్చి 2: నాటో, ఐక్యరాజ్యసమితి(యూఎన్) నుంచి అమెరికా నిష్క్రమించాలన్న పిలుపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన సలహాదారు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ తన సమ్మతిని ఎక్స్ వేదికగా తెలిపారు. నాటో, యూఎన్ నుంచి అమెరికా బయటకు వచ్చే సమయం ఆసన్నమైందంటూ మితవాద రాజకీయ వ్యాఖ్యాత ఒకరు ఆదివారం ఎక్స్‌లో పెట్టిన పోస్టుకు తాను అంగీకరిస్తున్నానంటూ మస్క్ స్పందించారు. అమెరికాకే మొదటి ప్రాధాన్యం అన్న ట్రంప్ ప్రభుత్వ విధానానికి యూఎన్ మద్దతు తెలియచేయనందున అందులో నుంచి నిష్క్రమించాలని కోరుతూ పలువురు రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు బిల్లును సమర్పించిన నేపథ్యంలో మస్క్ నుంచి ఈ రకమైన స్పందన వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.