జకర్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున కెపులవన్ బరత్ దయాలో భూ ప్రకంపణలు వచ్చాయని, దీని తీవ్రత 6.4గా నమోదయిందని యూరోపియన్-మెడిటేరియన్ సీస్మోలజికల్ సెంటర్ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 127 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు వచ్చాయని తెలిపింది. దీని ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం లేదని వెల్లడించింది. కాగా, అర్ధరాత్రి సమయంలో భూకంపం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి పరుగులు తీశారని అధికారులు తెలిపారు.
భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. కాగా, జనవరి 19న కూడా ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. అమహైకి సమీపంలో 5.5 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో జావా ద్వీపంలో కూడా భూ కదలికలు సంభవించాయి.