Earthquake | ఆఫ్ఘనిస్థాన్‌లో శనివారం భూకంపం సంభవించింది. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.8గా రికార్డైంది. ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు పాకిస్థాన్, జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో 181 కి.మీ లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. జాతీయ భూకంప కేంద్రం వెల్లడించిన ప్రకారం రాత్రి 9.31 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణనష్టం సంభవించిన వివరాలు తెలియరాలేదు. హిందూకుష్ ప్రాంతానికి 36.38 డిగ్రీల అకాంక్ష రేఖకు ఉత్తరాన, 70.77 డిగ్రీల రేఖాంశ రేఖకు తూర్పు దిక్కున భూమి కంపించింది.
ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంప ప్రభావం మన దేశ రాజధాని న్యూఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతాన్ని కూడా తాకాయి. దీంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల వాసులు భయాందోళనతో తమ ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భూమి రెండు సార్లు కంపించిందని నోయిడాలో నివసిస్తున్న ప్రీతి శంకర్ తెలిపారు. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి. యూరేపియన్, ఇండియన్ టెక్టోనిక్ ఫలకాల మధ్య రాపిడి తలెత్తడంతో భూకంపం సంభవిస్తున్నది.