Earthquake : ఇండోనేషియా (Indonesia) దేశంలో మంగళవారం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఆ భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి 39 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా ఇండోనేషియాలో వారం క్రితం అంటే ఈ నెల 7న కూడా ఒక భూకంపం సంభవించింది. భూమికి 109 కిలోమీటర్ల లోతులో ఆ భూకంప కేంద్రం ఏర్పడింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. ఇండోనేషియా రెండు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్స్ మధ్య ఉన్నది. ఆస్ట్రేలియన్ ప్లేట్, కొత్తగా విడిపోయిన సుందా ప్లేట్ మధ్య ఈ దేశం ఉంది. దాని కారణంగా ఆ దేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ భూకంపంవల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు.