బీజింగ్: వాయవ్య చైనాను తీవ్ర భూకంపం(Earthquake) కుదిపేసింది. హిమాలయ ప్రాంతమైన నేపాల్ సమీపంలో.. టిబెట్ కేంద్రంగా భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఆ భూకంపం వల్ల పశ్చిమ చైనాలో 9 మంది మృతిచెందారు. టిబెట్ ప్రాంతంలో సుమారు 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు చైనా ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. నేపాల్ బోర్డర్ సమీపంలో భూకంపం వచ్చినట్లు పేర్కొన్నది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నది.
అయితే చైనాకు చెందిన మానిటరింగ్ ఏజెన్సీ మాత్రం భూకంప తీవ్రతను 6.8గా పేర్కొన్నది. టిబెల్ రాజధాని లాసాకు సుమారు 380 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. భూకంప కేంద్రానికి 5 కిలోమీటర్ల చుట్టు వరకు పెద్దగా జనసంచారం లేదన్నారు. జీజాంగ్ అటానమస్ ప్రాంతంలో భూమి కంపించినట్లు చైనా మీడియా పేర్కొన్నది.