Water Cycle | న్యూయార్క్: భూగర్భంలో భారీ రిజర్వాయర్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూ ఉపరితలం నుంచి సుమారు 400 మైళ్ల లోతుల్లో భూ పొరల్లో రింగ్వుడైట్ అనే ఖనిజంలో ఇది నిక్షిప్తమై ఉంది. ఈ మేరకు అమెరికాలోని కొలరాడోకు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త స్టీవ్ జాకబ్సెన్ వెల్లడించారు. భూగర్భంలో కనుగొన్న ఈ వాటర్ సైకిల్ (జల చక్రం) భూ ఉపరితలంపై ఎక్కువ భాగం నీరు ఎందుకు ఉన్నదో తెలియజేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. భూకంప తరంగాలపై అధ్యయనం చేసే క్రమంలో ఈ భారీ రిజర్వాయర్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ రిజర్వాయర్‌లోని నీరు ఘన, ద్రవ, వాయు రూపాల్లో కాకుండా, నాలుగో రూపంలో నిల్వ ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటిని స్పాంజి పీల్చినట్టు.. ఈ నీరు మాంటిల్ రాక్‌లోని రింగ్వుడైట్ ఖనిజంలో నిక్షిప్తమై ఉన్నట్టు భావిస్తున్నారు. భూపొరల్లోని 1 శాతం రింగ్వుడైట్ నీటిని గ్రహించి ఉందని అనుకుంటే.. అది అన్ని మహాసముద్రాల్లోని నీటి కంటే మూడు రెట్లు ఎక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి అన్ని పొరల్లో నీటిజాడలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.