హరారే, సెప్టెంబర్ 17: దక్షిణ ఆఫ్రికా దేశాల్లో తీవ్ర కరవు పరిస్థితులున్నాయి. జింబాబ్వే, నమీబియా దేశాల్లో దయనీయ పరిస్థితులు ఉండటంతో ఆ ప్రభుత్వాలు వందలాది ఏనుగులు, ఇతర అడవి జంతువులను వధించి ఆకలితో అలమటిస్తున్న పౌరులకు వాటి మాంసాన్ని ఆహారంగా అందించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు సోమవారం ప్రకటించాయి. జింబాబ్వేలో 200 ఏనుగులను చంపి వాటి మాంసాన్ని అన్నార్థులకు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించగా, తమ దేశంలోని 83 ఏనుగులు సహా 700 అడవి జంతువులను హతమార్చాలని నిర్ణయించినట్టు నమీబియా తెలిపింది. దీనిపై జింబాబ్వే నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి థినాషే ఫరావో మాట్లాడుతూ అవసరమైన జాతుల వారు ఏనుగులు వేటాడటానికి అనుమతులు ఇచ్చేశామని, కొన్నింటిని తాము చంపి వారికి అప్పగిస్తామని చెప్పారు.