Drone attack : ఇజ్రాయెల్‌లోని ఓ సైనిక స్థావరమే లక్ష్యంగా హెజ్బొల్లా మనవరహిత విమానాలు దాడి చేశాయి. ఈ ఘటనలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందగా.. దాదాపు 67 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జిహలేవి కూడా ఈ దాడిలో మృతిచెందినట్లు ఇంటర్నెట్లో ప్రచారం జరుగుతోంది. అమెరికా కామెంటేటర్ జాక్సన్ హింక్లె కూడా దీనిని ప్రస్తావించడంతో ప్రచారం తీవ్రమైంది. ఆయన తన వెరిఫైడ్ ఎక్స్ ఖాతాల్లో ఈ విషయాన్ని ప్రచారం చేశారు.
అయితే కొద్దిసేపటి తర్వాత అది తప్పుడు ప్రచారం అంటూ జెరూసలెం పోస్టు ఓ కథనం ప్రచురించింది. దాడి జరిగిన ప్రదేశం ఐడీఎఫ్ గోలాన్ బ్రిగేడ్‌కు చెందిన శిక్షణ శిబిరంలోని మెస్‌గా తెలుస్తోంది. డ్రోన్ల దండు ఏకకాలంలో విరుచుకుపడటంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నిర్వీర్యమైపోయినట్లు సమాచారం. దీనిపై ఐడీఎఫ్ ప్రతినిధి హగారీ స్పందిస్తూ.. తమకు ఈ యుద్ధంపై పూర్తిగా పట్టు ఉందని ప్రకటించారు. దాడి చేసిన మానవ రహిత విమానం తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఎలా తప్పించుకున్నదో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, ఇజ్రాయెల్‌పై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. దాడిలో ఉపయోగించినవి హెజ్బొల్లా అమ్ములపొదిలోని మిర్సాద్-1 రకం డ్రోన్లుగా వెల్లడించారు. ఈ డ్రోన్ 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై గంటకు 370 కిలోమీటర్ల వేగంతో దాడి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో దాదాపు 40 కిలోల పేలుడు పదార్థాలను అమర్చవచ్చని తెలిపారు. ఇది దాదాపు 3,000 మీటర్ల ఎత్తువరకు ఎగరగలదు. ఇది ఇరాన్‌కు చెందిన సూసైడ్ డ్రోన్ మొహాజిర్-2 శ్రేణికి చెందినది.
హెజ్బొల్లా ప్రధాన డ్రోన్లు కూడా ఇవే కావడం గమనార్హం. ఈ డ్రోన్లను హెజ్బొల్లా 2002 నుంచి వాడుతోంది. హెజ్బొల్లా భారీ సంఖ్యలో రాకెట్లతో కలిపి ఈ డ్రోన్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇది తప్పించుకోవడం ఇదే తొలిసారి అని టెల్ అవీవ్ సైనిక నిపుణులు వెల్లడించారు