వాషింగ్టన్, జనవరి 10: ఆరు నూరైనా ద్వీప ప్రాంతమైన గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృత నిశ్చయంతో ఉన్నారు. స్వయం ప్రతిపత్తి గల ఆర్కిటిక్ ద్వీపంపై డెన్మార్క్ సార్వభౌమత్వాన్ని పక్కనపెట్టి గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడాని బల ప్రయోగం చేయాలని ట్రంప్ శుక్రవారం మరోసారి తన అధికారులకు సూచించారు. ‘వారికి నచ్చినా నచ్చకపోయినా గ్రీన్లాండ్ విషయంలో మేము ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం.’ అని శ్వేత సౌధంలో ఆయిల్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశమైన అనంతరం ట్రంప్ పేర్కొన్నారు. ‘నేను సులభమైన మార్గంలో ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాను.
కానీ దానికి సులభమైన మార్గం కుదరకపోతే కఠినమైన మార్గంలో చేయబోతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ఆర్కిటిక్‌లో చైనా, రష్యాల మిలిటరీ కార్యకలాపాలు ఉద్ధృతమైన క్రమంలో అమెరికా జాతీయ భద్రతకు ఖనిజ నిక్షేపాలు కలిగిన గ్రీన్‌ల్యాండ్‌పై నియంత్రణ తమకు తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. ‘ రష్యా, లేదా చైనా గ్రీన్ ల్యాండ్‌ను ఆక్రమించేలా మేం చేయబోవడం లేదు. మేం అలా చేయకపోతే వాళ్లు అలాగే చేస్తారు. కాబట్టి మేం గ్రీన్ ల్యాండ్‌లో ఏదైనా చేస్తాం. అది మంచి మార్గంలో కాని.. కష్టతరమైన మార్గంలో కాని’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే గ్రీన్‌ల్యాండ్‌లో మిలిటరీ బేస్‌ను కలిగి ఉన్న అమెరికా.. దాన్ని స్వాధీనం చేసుకుంటామంటూ చేస్తున్న ప్రకటనలపై డెన్మార్క్, ఇతర యూరోపియన్ కూటమి దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మా భవిష్యత్తు మేమే నిర్ణయించుకుంటాం
‘గ్రీన్లాండ్ ప్రజలు అమెరికన్లుగా మారాలని కోరుకోవడం లేదు. ఆర్కిటిక్ ద్వీప భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటాం’ అని స్వయం పాలన కలిగిన డానిష్ భూభాగంలోని నేతలు స్పష్టం చేశారు. ట్రంప్ తాజా హెచ్చరికల గ్రీన్లాండ్ పార్లమెంట్‌కు చెందిన ప్రధాని జెన్స్ ఫ్రెడెరిక్ నీల్సన్ సహా ఐదు రాజకీయ పార్టీల నేతలు శుక్రవారం రాత్రి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘మేం అమెరికన్లు కావాలనుకోవడం లేదు. అలాగని డానిష్లము కూడా కావాలనుకోవడం లేదు. మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటాం’ అని వారు స్పష్టం చేశారు.
పుతిన్‌ను అరెస్ట్ చేసే అవసరం లేదు ; పరిష్కారానికి దగ్గరగా రష్యా, ఉక్రెయిన్ సమస్య డొనాల్డ్ ట్రంప్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చెప్పారు. పుతిన్ విషయంలో తాను చాలా నిరాశతో ఉన్నానన్నారు. అయితే, తమ మధ్య ఎల్లప్పుడూ గొప్ప సంబంధాలు ఉంటాయని తెలిపారు. వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా నిర్బంధించిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ పుతిన్‌ను పరోక్షంగా ప్రస్తావించారు. “ఓ నియంతను చూడాల్సిన తీరు ఇదే. అయితే, తదుపరి చేయవలసినదేమిటో అమెరికాకు తెలుసు” అన్నారు. దీనిపై విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించారు. జెలెన్స్కీతో ట్రంప్ విభేదించారు. అటువంటి అవసరం లేదన్నారు. పరిష్కారం కుదరడానికి దగ్గరగా రష్యా-ఉక్రెయిన్ ఉన్నాయన్నారు. గత నెలలో ఈ యుద్ధంలో 31 వేల మంది మరణించారని, వీరిలో అత్యధికులు రష్యన్ సైనికులని చెప్పారు. రష్యన్ ఆర్థిక వ్యవస్థ దయనీయ స్థితిలో ఉందన్నారు. దీనికి పరిష్కారం కుదరబోతున్నదని చెప్పారు. చాలా మంది చనిపోతున్నారని, వీరిలో ఎక్కువ మంది సైనికులేనని, తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలపై పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అనేక అరెస్ట్ వారంట్లను జారీ చేసింది.