న్యూయార్క్/వాషింగ్టన్, ఆగస్టు 7: భారతీయ దిగుమతులపై అమెరికా తొలుత విధించిన 25 శాతం సుంకాలు గురువారం(ఆగస్టు 7) నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు అర్ధరాత్రి!! వందలాది కోట్ల డాలర్ల సుంకాలు అమెరికాలోకి ఇప్పుడు ప్రవహిస్తాయి అని అమెరికాలో గడియారం ముల్లు అర్ధరాత్రి 12 గంటలపైకి వచ్చిన క్షణాన ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. గత వారం ట్రంప్ భారత్‌పై విధించిన 25 శాతం ప్రతీకార సుంకాలు గురువారం నుంచి అమలులోకి వచ్చాయి. చాలా ఏళ్లుగా అమెరికా నుంచి ప్రయోజనాలు పొందిన దేశాల నుంచి వందల కోట్ల డాలర్లు అమెరికాలోకి ఇక ప్రవహిస్తాయని, తమ దేశం ఓడిపోవాలని కోరుకునే వామపక్ష భావజాల న్యాయస్థానం మాత్రమే అమెరికా గొప్పదనాన్ని అడ్డుకుంటోందని ట్రంప్ తన పోస్టులో వ్యాఖ్యానించారు.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై వివిధ రకాల సుంకాలు విధిస్తూ గత వారం అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేశారు. ఇందులో భాగంగా భారత్‌పై 25 శాతం సుంకాలను వైట్ హౌస్ ప్రకటించింది. దాదాపు 70 దేశాలకు సుంకాల రేట్లను సవరిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ జాబితాలో 10 నుంచి 40 శాతం వరకు సుంకాలు ఎదుర్కొంటున్న దేశాలు ఉన్నాయి. జపాన్‌పై 15 శాతం సుంకం విధించగా లావోస్, మయన్మార్‌పై 40 శాతం చొప్పున, పాకిస్థాన్‌పై 19 శాతం, శ్రీలంకపై 20 శాతం, బ్రిటన్‌పై 10 శాతం సుంకాన్ని అమెరికా విధించింది.
గతవారం ప్రకటించిన 25 శాతం సుంకానికి అదనంగా రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తున్నందుకు ప్రతీకారంగా ట్రంప్ బుధవారం మరో 25 శాతం సుంకాన్ని భారత్‌పై విధించారు. దీంతో భారత్‌పై విధించిన మొత్తం సుంకం 50 శాతానికి చేరుకుంది. ప్రపంచంలో అత్యధిక సుంకాలను ఎదుర్కోనున్న దేశంగా భారత్ అవతరించింది. అదనంగా విధించిన 25 శాతం సుంకం 21 రోజుల తర్వాత ఆగస్టు 27 నుంచి అమలులోకి రానున్నది. అమెరికా విధించిన సుంకాలపై భారత్ స్పందిస్తూ ఇది అన్యాయం, అసంబద్ధంగా అభివర్ణించింది. ఇతర దేశాల తరహాలోనే తన జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను పరిరక్షించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భారత్ ప్రకటించింది.
భారత్‌పై అమెరికా విధించిన అదనపు సుంకాలపై అమెరికాలోని వివిధ వృత్తులకు చెందిన భారతీయ నాయకులకు చెందిన ఇండియాస్పోరా అనే సంస్థ స్పందించింది. ఈ ప్రతికూలత తాత్కాలిక పరిణామంగా అభివర్ణించింది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల పట్ల ఆశావహ దృక్పథంతో ఉన్నామని, ఇవి ఉభయ దేశాలకు చెందిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఫలప్రదమవుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
వాషింగ్టన్ : భారత దేశంపై టారిఫ్‌ల మీద టారిఫ్‌లు విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో విడత వడ్డిస్తానని హెచ్చరించారు. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నారనే సాకుతో 25 శాతం చొప్పున వరుసగా రెండుసార్లు విధించిన టారిఫ్ ఇప్పటికే 50 శాతానికి చేరింది. రష్యా నుంచి చైనా కూడా చమురును కొంటున్నప్పటికీ, కేవలం భారత్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యం చేసుకున్నారని విలేకర్లు ప్రశ్నించినపుడు ట్రంప్ స్పందిస్తూ, “ఇప్పటికి ఎనిమిది గంటలే అయింది. చూద్దాం ఏం జరుగుతుందో” అన్నారు. “మీరు మరిన్ని చూడబోతున్నారు. మీరు తదుపరి ఆంక్షలను చూడబోతున్నారు” అని చెప్పారు.