న్యూయార్క్: అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ నేత డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు 265 ఎలక్టోరల్ ఓట్లను సొంతం చేసుకున్నారు. దీంతో దేశాధ్యక్ష బాధ్యతలను ఆయన రెండవ సారి చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. 270 మెజారిటీ మార్క్‌ను ట్రంప్ పార్టీ దాటే ఛాన్సు పుష్కలంగా ఉన్నది. ఒకవేళ ట్రంప్ కనుక ప్రస్తుతం ఎన్నికల్లో విజయం సాధిస్తే, ఇది ఆయనకు అసాధారణ రాజకీయ ఘనతే అవుతుంది. ఎన్నికల ప్రచార వేళ ట్రంప్, జేడీ వాన్స్ ఇచ్చిన ప్రసంగాలే కీలకం కానున్నాయి.
78 ఏళ్ల ట్రంప్‌పై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక దాంట్లో ఆయన దోషిగా తేలారు. మరో మూడు వారాల్లో ఆయనకు ఆ కేసులో శిక్ష పడాల్సి ఉన్నది. ఇంకా ఆయనపై అనేక సివిల్ కేసులు ఉన్నాయి. గడిచిన 8 ఏళ్లలో అనేక కుంభకోణాల్లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ వైట్‌హౌజ్ రేసులో ట్రంప్ ప్రదర్శిస్తున్న షో.. అందర్నీ స్టన్ చేస్తోంది. రెండోవసారి అమెరికా దేశాధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించడం అది అపూర్వ విజయమే అవుతుంది. అమెరికా రాజకీయాల్లోనే ట్రంప్ విజయం ఓ అసాధారణ ఫీట్‌గా నిలువనున్నది.
2016 ఎన్నికల్లో తొలిసారి ట్రంప్ దేశాధ్యక్షుడిగా విజయం సాధించారు. 2020 ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఆయన ఓడిపోయారు. కానీ ఎన్ని కేసులు ఉన్నా.. రెండోసారి అధ్యక్ష పీఠం కోసం ట్రంప్ పోరాడిన తీరు సంక్లిష్టమైంది. తాజా సమాచారం ప్రకారం కీలకమైన ఏడు రాష్ట్రాల్లోనూ ట్రంప్ పార్టీ హవా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియా రాష్ట్రంలో కూడా ట్రంప్ పార్టీ కాస్త మెరుగ్గా ప్రదర్శిస్తున్నట్లు సమాచారం వస్తోంది. ఒకవేళ ట్రంప్ ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటే ఇక ఆయన రెండవసారి అధ్యక్షుడు కావడం సులభమే. కానీ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు చెందిన పూర్తి స్థాయి ఫలితాలు వెలుబడాలంటే మరో వారం రోజులు పట్టే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
మేక్ అమెరికా గ్రేట్ వన్స్ అగైన్ నినాదంతో ట్రంప్ ఈ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే 2020లో బైడెన్ చేతిలో ఓడిన ట్రంప్.. రెండో సారి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది. వరుసగా కాకుండా.. రెండోసారి దేశాధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్న రెండవ దేశాధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు క్రియేట్ చేయనున్నారు. 1892లో గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ రెండోసారి(నాన్కాంజిక్యూటివ్) బాధ్యతలు చేపట్టారు.
దేశాధ్యక్ష అభ్యర్థిగా మళ్లీ పోటీ చేయనున్నట్లు 2022, నవంబర్ 15వ తేదీన ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత బైడెన్, ట్రంప్ మధ్య డిబేట్ జరిగింది. కానీ ఆ చర్చలో బైడెన్ విఫలం అయ్యారు. దీంతో ఆయనపై వత్తిడి పెరిగింది. అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని బైడెన్‌పై డెమోక్రాట్లు వత్తిడి తెచ్చారు. ఆ తర్వాత కమలా హ్యారిస్ రేసులో నిలిచారు. అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ ప్రకటించిన తర్వాత.. ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నం ప్రయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో.. ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్ ట్రంప్ చెవిని చీల్చింది. ఇక ఫ్లోరిడా గోల్ఫ్‌కోర్సులో ఓ వ్యక్తి ఏకే 47తో పట్టుబడ్డారు. ట్రంప్‌ను హత్య చేసేందుకు ఆ వ్యక్తి వచ్చినట్లు గుర్తించారు.
హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియా రాష్ట్రానికి వెళ్లి.. అక్కడ ఉన్న మెక్‌డోనాల్డ్స్ స్టోర్‌లో ట్రంప్ సర్వ్ చేశారు. ట్రంప్ మద్దతుదారులను చెత్తతో పోల్చారు బైడెన్. దీంతో ట్రంప్ ఓ గార్బేజ్ వాహనాన్ని ఎక్కి నడిపారు. ఇక ఎన్నికల కోసం బిలియనీర్ మస్క్ .. రిపబ్లికన్ నేతకు సపోర్టు ఇచ్చారు.