(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడాన్ని సాకుగా చూపిస్తూ భారత్‌పై ఈ టారిఫ్‌లను వడ్డించారు. దీంతో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై తీవ్రంగా చర్చ జరుగుతున్నది. వాస్తవానికి రష్యా నుంచి ముడి చమురును భారత్ చవగ్గా కొనుగోలు చేస్తున్నప్పటికీ, ఆ ప్రయోజనాలు దేశ ప్రజలకు దక్కట్లేదు. రష్యా చమురుతో దేశీయ ప్రైవేటు కంపెనీలే భారీగా లబ్ధి పొందుతున్నాయి. నిజం. రష్యా నుంచి చవగ్గా దిగుమతి చేసుకొంటున్న చమురును దేశీయ ప్రైవేటు కంపెనీలు పశ్చిమ దేశాలకు ఎక్కువ రేట్లకు విక్రయించి లాభాలను దండుకొంటున్నాయి.
దేశంలోని ప్రభుత్వ రంగ ఆయిల్ రీఫైనరీలకు ఇతర దేశాలకు పెట్రోల్, డీజిల్ ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతి లేదు. ప్రైవేటు సంస్థలకు మాత్రం ఇలాంటి ఆంక్షలు ఏవీ లేవు. ఇదే ఇప్పుడు రిలయన్స్ ఎనర్జీ, నయారా ఎనర్జీ సంస్థలకు లాభాలపంట పండటానికి కారణమైంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీనికి ప్రతీకారంగా ఆయా దేశాలకు చమురు ఎగుమతులను రష్యా నిలిపేసింది. ఫలితంగా పశ్చిమ దేశాల్లో చమురు కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశాలు ఎక్కువ ధరకైనా చమురు కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇది ఆసరాగా చేసుకున్న దేశంలోని ప్రైవేటు రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి చౌకగా చమురును దిగుమతి చేసుకొని.. పశ్చిమ దేశాలకు ఎక్కువ ధరలకు విక్రయించి భారీగా లాభాలు పొందుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో దేశానికి గానీ, సామాన్యులకు గానీ ఒనగూరుతున్న లాభం మాత్రం ఏమీ లేదు. పైగా ట్రంప్ తాజా సుంకాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఆగమాగమయ్యే ప్రమాదం ఉన్నదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా రష్యా చమురుతో ఒకవైపు ప్రైవేటుకు లాభాల పంట పండుతుండగా.. మరోవైపు దేశ ఆర్థికానికి, సామాన్యులకు గడ్డు పరిస్థితులు వచ్చినట్టు అర్థమవుతున్నది.
నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే కుదేలైన పేద, మధ్యతరగతి ప్రజలను పెట్రో మంట మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఉక్రెయిన్-రష్యా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇంధన ధరలను మాత్రం తగ్గించడంలేదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గితే, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి. కానీ కేంద్రం ఎక్సైజ్ సుంకాల పేరిట సవరణలు చేస్తూ ఇంధన ధరలను తగ్గించడంలేదు. దీనికోసం ఎక్సైజ్ డ్యూటీ పేరిట అదనపు సుంకాలను విధిస్తున్నది. మొన్నటి వరకూ రష్యా నుంచి తక్కువ ధరకే చమురును కొనుగోలు చేసిన ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు కూడా దేశీయంగా పెట్రో ధరలను మాత్రం తగ్గించలేదు.
భారత్ రూ. 107
బంగ్లాదేశ్ రూ. 85
పాకిస్థాన్ రూ. 80.4
చైనా రూ. 94.5
అమెరికా రూ. 79.4
రష్యా రూ. 67.1
భూటాన్ రూ. 58.8
ఇరాన్ రూ. 2.4
లిబియా రూ. 2.3