Donald Trump : అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harward University) లో మొత్తం 31 శాతం మంది విదేశీ విద్యార్థులు ఉన్నారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. ఆయా విద్యార్థుల పేర్లు, వారి దేశాల వివరాలు తమకు అందజేయాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ట్రూత్ సోషల్ (Truth Social) లో ఒక పోస్టు పెట్టారు. ఇదిలావుంటే హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేస్తూ ట్రంప్ కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్కడి ఫెడరల్ న్యాయమూర్తి దాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ఆదివారం ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు.
మొత్తం 31 శాతం మంది విదేశీ విద్యార్థులున్నారనే విషయాన్ని హార్వర్డ్ ఎందుకు చెప్పడం లేదని ట్రంప్ ప్రశ్నించారు. వారిలో అమెరికా వ్యతిరేక దేశాల నుంచి వచ్చిన వాళ్లూ ఉన్నారని, ఆయా దేశాలు వారి విద్యార్థుల చదువు కోసం ఎలాంటి సొమ్ము చెల్లించడం లేదని, ఆ విదేశీ విద్యార్థుల వివరాలు తాము తెలుసుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీకి తాము బిలియన్ డాలర్లు చెల్లించామని తెలిపారు. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థుల వివరాలు తెలుసుకోవాలనే మా అభ్యర్థన సరైనదేనని, తమకు ఆ విద్యార్థుల పేర్లు, దేశాల వివరాలు కావాలని అన్నారు.
లేదంటే మీ దగ్గర ఉన్న రూ.442 కోట్లనే ఉపయోగించుకోవాలని, డబ్బు కోసం ఫెడరల్ ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞప్తులు చేయొద్దని హార్వర్డ్ యూనివర్సిటీకి హెచ్చరిక చేశారు. కాగా హార్వర్డ్ యూనివర్సిటీకి అందించే నిధుల్లో ట్రంప్ ఇటీవల కోత విధించారు. ఈ గురువారం ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రంప్ చర్య అనైతికమని, నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంది. ఒక్క సంతకంతో వర్సిటీలోని పావు వంతు మందిని తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కోర్టుకు తెలిపింది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి.. ట్రంప్ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీచేశారు.