Donald trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌లోని అక్రమ వలసదారులపై ఆయన విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్షడిగా ఎన్నికైతే అమెరికా పౌరులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధిస్తానని సంచలను కామెంట్స్ చేశారు. కొలరాడోలోని అరోరాలో నిర్వహించిన ప్రచార సభలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికాను ప్రమాదకరమైన నేరస్థులు ఆక్రమించుకున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా యూఎస్‌ను ఆక్రమిత అమెరికాగా పిలుస్తున్నారని అన్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వలసదారులే లక్ష్యంగా నేషనల్ ఆపరేషన్ అరోరాను మొదలుపెడతానని చెప్పారు. నవంబర్ 5 అమెరికా విముక్తి దినోత్సవంగా మారుతుందని పేర్కొన్నారు. అమెరికన్ పౌరులను, చట్టబద్ధంగా ఉన్న అధికారులను చంపిన వలసదారులకు ఉరిశిక్ష విధిస్తానని ప్రకటించారు.
ఆరోరాను వేధిస్తున్న వెనెజువెలా గ్యాంగ్ ట్రెన్ డె అరగువా సభ్యుల ఏరివేతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. అరోరా నుంచి అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రతి పట్టణాన్ని తాను రక్షిస్తానని, ఆ ప్రమాదకరమైన నేరస్థులను దేశం నుంచి తడిమికొడతామని అన్నారు. దక్షిణ సరిహద్దులో మెక్సికోతో యూఎస్ ప్రభుత్వం చాలా ఏళ్లుగా ఇబ్బందులను ఎదుర్కుంటోందని, ఈ కారణంగా ఆ ప్రాంతంలో చొరబాట్లు విపరీతంగా పెరిగిపోయాయని, అన్ని సమస్యలను తాను అధ్యక్షడిని అయ్యాక పరిష్కరిస్తానని ట్రంప్ అన్నారు.